403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24 | Muslims in Uttar Pradesh Assembly has decreased greatly in strength. | Sakshi
Sakshi News home page

403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24

Mar 13 2017 2:16 AM | Updated on Mar 29 2019 9:31 PM

403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24 - Sakshi

403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ముస్లింల బలం అనూహ్యంగా తగ్గింది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ముస్లింల బలం అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రంలో 19 శాతం ముస్లింలు ఉండగా... తాజా శాసనసభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన 24 మంది మాత్రమే విజయం సాధించారు. 2012 ఎన్నికల్లో 69 మంది ముస్లిం సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ నినాదం ‘సబ్‌కా సాత్‌... సబ్‌కా వికాస్‌’ఊదరగొట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)... మొత్తం 403 స్థానాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికల బరిలోకి దింపకపోవడం గమనార్హం. ముస్లింలు అధికంగా ఉండే రోహిల్‌ఖండ్, తెరాయ్‌తో పాటు యాదవులు, దళితులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న తూర్పు ప్రాంతం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు పెద్ద ఓటు బ్యాంకులు.

ఈ సామాజిక లెక్కల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌తో జతకట్టింది ముస్లింల ఓటు బ్యాంకు కోసమే. ఈ ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య చీలిపోతే... అంతిమంగా అది బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నది వారి అంచనా. మరోవైపు యూపీలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఆందోళనకరంగా తగ్గుతోంది. ఈసారి 479 మంది మహిళా అభ్యర్థులు పోటీపడితే... 40 మంది మాత్రమే గెలిచారు. వీరి గెలుపు శాతం పది కంటే తక్కువ. ఇక... 403 మంది నూతన శాసనసభ్యుల్లో డిగ్రీ ఆపై చదువులు చదివినవారు 290 మంది.

143 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 403 కొత్త ఎమ్మెల్యేల్లో 143 మంది నేర చరితులు, 322 మంది కోటీశ్వరులు ఉన్నారు. నేర చరితుల్లో హత్య తదితర తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నట్టు ‘నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌’నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో బీజేపీ తరుఫున కోలొనెల్‌గంజ్‌ స్థానం నుంచి నెగ్గిన అజయ్‌ప్రతాప్‌సింగ్‌ టాప్‌లో ఉన్నారు. ఈయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.49 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,455 మంది కోటీశ్వరులు పోటీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement