కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య | inter 1st year student commits suicide in vijayawada stella college | Sakshi
Sakshi News home page

కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

Sep 22 2015 3:22 AM | Updated on Nov 9 2018 4:36 PM

కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

ఏపీలోని విజయవాడలో మారిస్‌స్టెల్లా కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

విజయవాడ (పటమట): ఏపీలోని విజయవాడలో మారిస్‌స్టెల్లా కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన దొమ్మేటి భానుప్రీతి (16) సోమవారం కళాశాల హాస్టల్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. జంగారెడ్డిగూడేనికి చెందిన సుబ్బారావు తన రెండో కుమార్తె భానుప్రీతిని మొదటి సంవత్సరం ఇంటర్ ఎంపీసీలో చేర్పించి అక్కడే హాస్టల్లో ఉంచారు. అనారోగ్య కారణాలతో 20 రోజుల కిందట ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి హాస్టల్‌కు తిరిగివచ్చింది.

సోమవారం యూనిట్ టెస్ట్‌ల్లో భాగంగా చివరి పరీక్ష జరుగుతుండగా హాజరుకాకుండా రూమ్‌లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం తోటివిద్యార్థులతో కలసి భోజనం చేసిన తరువాత విద్యార్థులందరూ పరీక్ష రాసేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగొచ్చిన విద్యార్థులు తలుపు తట్టగా ఎంతకీ తీయకపోవడంతో పగులగొట్టి చూడగా భానుప్రీతి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని భోరున విలపించారు. అనారోగ్య కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు హాస్టల్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు.
 
నా కుమార్తె పిరికిది కాదు
‘నా బిడ్డ పిరికిది కాదు.. ఎవరో కావాలని చేశారు. ఉరి వేసుకున్న ఫ్యానుకు, బెడ్‌కు మధ్య చాలా తేడా ఉంది. సోమవారం సాయంత్రం కళాశాల యాజమాన్యం  ఫోన్ చేసి భానుప్రీతి ఉరేసుకుందని, వచ్చి తీసుకెళ్లమని ఫోన్ పెట్టేశారు. కళాశాల యాజమాన్యం వైఖరిపై అనుమానం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
- డి.సుబ్బారావు, మృతురాలి తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement