ట్రంప్‌ అభిశంసనకు మార్గాలివీ..!

ట్రంప్‌ అభిశంసనకు మార్గాలివీ..! - Sakshi

  • అమెరికా వర్సిటీ ప్రొఫెసర్‌ తాజా పుస్తకం

  • డొనాల్డ్‌ గెలుస్తారని ముందే చెప్పిన ప్రొఫెసర్‌

  • అభిశంసన మీదా జోస్యం.. మార్గాల వివరణ

  • ట్రంప్‌ అనుసరించాల్సిన వ్యూహంపై సూచన

  •  

    అలాన్‌లిచ్‌మన్‌.. అమెరికా యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుస్తాడని ముందుగా జోస్యం చెప్పిన రాజకీయ విశ్లేషకుడు. ఆ ఎన్నికలే కాదు.. 1982 నుంచి అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా అంచనా వేసి చెప్పిన పండితుడు. తన గెలుపు ఖాయమని ముందుగానే చెప్పిన ఈ ప్రొఫెసర్‌కి.. ట్రంప్‌ స్వయంగా అభినందనలు కూడా తెలిపారు. అయితే.. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచాక అభిశంసనకు కూడా గురవుతారని అదే ప్రొఫెసర్‌ అప్పుడే చెప్పారు. ఇప్పుడు ట్రంప్‌ను అభిశంసించడానికి గల మార్గాలేమిటనేది వివరిస్తూ ఏకంగా ఒక పుస్తకమే రాసేశారు. ఆ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించనున్నారు.

     

    జవాబు చెప్పకుండా తప్పించుకోలేరు..: ‘‘ట్రంప్‌తన కెరీర్‌లో ఎన్నడూ జవాబుదారీగా లేరు. కానీ.. ఎవరైనా సరే ఒక అధ్యక్షుడిగా జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరు. దివాళాతీశానని ప్రకటించజాలరు. ఒప్పందాన్ని గాలికి వదిలేయజాలరు. చిట్టచివరికి జవాబు చెప్పాల్సింది అభిశంసనకే’’ అని ప్రొఫెసర్‌ అలాన్‌ ‘టైమ్‌’ మేగజైన్‌తో పేర్కొన్నారు. ‘‘ట్రంప్‌ను అభిశంససించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన అనుసరిస్తున్న విధానాలు మన రాజ్యాంగ ఆదేశాలు, మన స్వాతంత్య్రాలు, మన స్వేచ్ఛలు, మన జాతీయ భద్రతకు మరింత ప్రమాదకరమైనవి. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన అందరు అధ్యక్షుల్లోకెల్లా ట్రంప్‌ అభిశంసనకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు.

     

    ట్రంప్‌ అభిశంసనకు మార్గాలివీ..: అలాన్‌ ‘ద కేస్‌ ఫర్‌ ఇంపీచ్‌మెంట్‌’ అనే పేరుతో రాసిన తన పుస్తకంలో ట్రంప్‌ను అభిశంసించడానికి గల ఎనిమిది కారణాలను వివరించారు. దేశాధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలతో ఆయన వ్యాపార ప్రయోజనాల సంఘర్షణ, ట్రంప్‌ అనుయాయుల బృందానికి రష్యాతో ఉన్న సంబంధాలు, ట్రంప్‌ యూనివర్సిటీపై ఉన్న కేసుల వంటి గత న్యాయవివాదాలు.. అన్నిటికీ మించి వాతావరణ మార్పు విషయంలో చర్యలు చేపట్టడానికి నిరాకరించడం ద్వారా ‘మానవాళిపై నేరానికి పాల్పడ్డ’ ఆరోపణలతో  ట్రంప్‌ను అభిశంసించవచ్చునని అలాన్‌ పేర్కొన్నారు.

     

    ‘రష్యాతో కుమ్మక్కు’పై అభశంసనకు అవకాశం..: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకునేందుకు వీలుగా ట్రంప్‌ బృందం రష్యా వారితో కుమ్మక్కయిందన్న అంశమే.. ట్రంప్‌ అభిశంసనకు ప్రధాన ఆధారం అయ్యే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు అలాన్‌చెప్పారు. ‘‘ఈ విషయంలో చాలా పొగ వస్తోంది. ఈ పొగను పుట్టిస్తున్న నిప్పు ఏదో ఉండే ఉంటుందని నా అనుమానం. అది అభిశంసనకు కారణమయ్యేంత తీవ్రంగా ఉంటుందా అనేది మనకు ఇంకా తెలియదు’’ అని వ్యాఖ్యానించారు.

     

    ఆధారాలు ఉంటే వారూ అభిశంసిస్తారు..: అమెరికా అధ్యక్షుడి అభిశంసన చాలా కష్టతరమైన ప్రక్రియ. అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించడం ఇంకా కష్టమైన పని. ప్రత్యేకించి అధ్యక్షుడి సొంత పార్టీయే కాంగ్రెస్‌లోనూ మెజారిటీలో ఉంటే మరింత కష్టమవుతుంది. ప్రస్తుతం ట్రంప్‌ సొంత పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీకే కాంగ్రెస్‌లో మెజారిటీ ఉంది. కానీ.. ట్రంప్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు బయటపడితే.. ట్రంప్‌ను అభిశంసించడానికి సరిపోయేంత మంది రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు ఇస్తారని అలాన్‌ విశ్వసిస్తున్నారు.



    అభిశంసనతో ట్రంప్‌ను తొలగించాలంటే..: ప్రస్తుత కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 193 మంది డెమొక్రాట్లతో పాటు 23 మంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే.. సెనేట్‌లో 46 మంది డెమొక్రాట్లకు తోడుగా 19 మంది రిపబ్లికన్‌సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు కూడా అభిశంసనకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.

     

    ట్రంప్‌ అనుసరించాల్సిన వ్యూహమిదీ..: ట్రంప్‌ను అభిశంసించే మార్గాలే కాదు.. ఆ ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ట్రంప్‌ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా అలాన్‌వివరించారు. తన వ్యాపార ప్రయోజనాల నుంచి తప్పుకోవడం, పర్యావరణ మార్పును నిరోధించడానికి చేపట్టే చర్యలకు మద్దతు ఇవ్వడం, వాస్తవాలను తనిఖీ చేసే సంస్థను నియమించుకోవడం, ముఖ్య వ్యూహకర్త స్టీవ్‌బానన్‌ను తొలగించడం వంటి చర్యలు ఆ వ్యూహంలో ఉన్నాయి.



    (సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top