భారత్‌కు ఫిచ్ వార్నింగ్ | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఫిచ్ వార్నింగ్

Published Tue, Aug 27 2013 12:43 AM

Fitch sends rating warning shot to India

ముంబై: ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోతే రేటింగ్‌ను తగ్గిస్తామని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ సోమవారం హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ప్రభుత్వ వ్యయం నియంత్రణకు అవకాశాలు తక్కువని ఫిచ్ అభిప్రాయపడుతోంది. అర్థిక గణాంకాలు ఆశావహంగా లేవని, ద్రవ్యలోటు లక్ష్యసాధనలో విఫలమైతే ప్రతికూల రేటింగ్ తప్పదని పేర్కొంది.
 
 ద్రవ్య నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్నదని ఫిచ్ విశ్లేషకులు ఆర్ట్ వూ పేర్కొన్నారు. ద్రవ్యలోటు పరిస్థితులు మరింత దిగజారితే రేటింగ్‌ను తగ్గిస్తామని గత ఏడాది అంతర్జాతీయ  రేటింగ్ సంస్థలు హెచ్చరించిననప్పుడు భారత్ వ్యయ నియంత్రణకు గట్టి చర్యలే తీసుకుంది. 5.2 శాతానికి ఎగబాకే ద్రవ్యలోటు ఈ చర్యల కారణంగా 4.89 శాతానికి తగ్గింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.8 శాతం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూపాయి భారీగా పతనమవుతుండడం, ప్రభుత్వ వ్యయం పెరుగుతుండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది.
 
 రూపాయి పతనానికి  ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్న పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ లోటును పేర్కొనవచ్చు.  గత ఆర్థిక సంవత్సరంలో 8,780 కోట్ల డాలర్లుగా ఉన్న కరెంట్ అకౌంట్ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,500 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. కరెంట్ అకౌంట్ లోటు గత రెండు ఆర్థిక సంవత్సరాల కంటే తగ్గొచ్చని ఫిచ్ ఏషియా-పసిఫిక్ సావరిన్స్ హెడ్ అండ్రూ కోల్‌హన్ చెప్పారు. అయితే రూపాయి పతనాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతమున్న 27,800 కోట్ల డాలర్ల నుంచి 23,000 కోట్ల డాలర్లకు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement