
మన ఇంజనీర్లయితే ఇవ్వలేరు
ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను
సింగపూర్ ఇంజనీర్లు కాబట్టే సకాలంలో ఇచ్చారు.. మాస్టర్‌ప్లాన్‌పై సీఎం వ్యాఖ్య
సంక్షోభంలోని పరిశ్రమలకు {పత్యేక ప్యాకేజీ ఇస్తాం
పారిశ్రామికవేత్తల సదస్సులో వెల్లడి
రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను భారతదేశంలోని ఇంజనీర్లు అయితే సకాలంలో ఇవ్వలేకపోయేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదే సింగపూర్‌కు చెందిన ఇంజనీర్లు కాబట్టే సకాలంలో ఇవ్వగలిగారని ఆయన అన్నారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన విషయంలో సింగపూర్ ఇంజనీర్ల సామర్ధ్యానికి ఇది నిదర్శనమన్నారు. మంగళవారం రాత్రి రాజమండ్రి ఆర్ట్స్‌కళాశాలలో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ద్వారా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. రాజమహేంద్రిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. అంతకుముందు రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న చక్కెర, టెక్స్‌టైల్, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను చక్కదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఆయా రంగాలను గుర్తించి వాటిని ఎలా మెరుగుపరచగలమనే విషయాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు సబ్సిడీలను ఎప్పటికప్పుడు ఇస్తామని తెలిపారు. పోర్టుల ఆధారంగా విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, భావనపాడులను పారిశ్రామిక క్లస్టర్‌లుగా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్, ఇసుజి ఉపాధ్యక్షుడు ఎస్ ఒకాబా యాషీలు తమ కంపెనీల ప్రజెంటేషన్లు ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై పెట్టుబడులు, మౌలికవసతుల శాఖ కమిషనర్ అజయ్‌జైన్ ప్రజెంటేషన్ సమర్పించారు. సన్‌రైజ్ ఏపీలో వ్యాపారావకాశాల గురించి ముద్రించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.
పారిశ్రామికవేత్తల అసహనం...
అత్యంత కీలకమైన సదస్సును పుష్కరాల రద్దీ సమయంలో రాజమండ్రిలో పెట్టడంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడ్డారు. లక్షలాది మంది జనం వస్తూ హోటళ్లు, రోడ్లు ఖాళీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టడం ఏమిటని కొందరు అసహనం వ్యక్తం చేశారు. సదస్సులో ఎవరికీ మాట్లాడే అవకాశం రాలేదు. ప్రభుత్వం, ఎంపిక చేసిన రెండు కంపెనీల ప్రజెంటేషన్లు తప్ప మిగిలిన వారిని పట్టించుకోలేదు. దీంతో ఈ సదస్సు ఎందుకు పెట్టినట్లని పారిశ్రామికవేత్తలు చర్చించుకోవడం కనిపించింది. కాగా పుష్కరాల అనంతరం ఉభయగోదావరి జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారిస్తామని సీఎం చెప్పారు. నరసాపురంలో పర్యటించిన ఆయన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.