breaking news
Industrialists Conference
-
అతివల సందడి
సాక్షి, విశాఖపట్నం: వివిధ దేశాల సంప్రదాయాలు, సంస్కృతులను కలబోసుకుని, విభిన్న వస్త్రధారణలతో వచ్చిన మహిళలు సందడి చేశారు. భావి పారిశ్రామికవేత్తలు, ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డ పలువురు మహిళామణులు కలియదిరుగుతూ కనిపించారు. భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలీప్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నగరంలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిభివృద్ధి సదస్సు ఇందుకు వేదికైంది. పారిశ్రామిక ‘నవకల్పనలు.. సాంకేతికోత్పత్తి.. పారిశ్రామికీకరణ’అనే అంశం ప్రాతిపదికగా మగువలు తమ సొంతకాళ్లపై ఎలా నిలబడాలి? అందుకవసరమైన వనరులు, ప్రభుత్వ సాయం ఏమి కావాలి? మార్కెటింగ్, నూతన వ్యాపారం, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి పలు అంశాలపై సదస్సులో మూడు రోజులపాటు చర్చిస్తారు. నిష్ణాతులతో సమావేశాలు, వారి పరిశోధనాంశాలపై చర్చలు, ఉత్పత్తుల ప్రదర్శనల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార వర్గాలకు, విద్యార్థులు, విద్యావేత్తలకు ఉపయోగపడేలా విశ్లేషిస్తారు. అలీప్ ఏర్పాటై 25 ఏళ్లయిన సందర్భంగా విశాఖలో తొలిసారిగా ఏర్పాటైన ఈ సదస్సును బుధవారం ఓ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సార్క్ దేశాలకు (ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్) చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు సుమారు 200 మంది హాజరయ్యారు. వీరిలో దక్షిణాసియా దేశాల సమాఖ్య సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ బి సియాల్, దక్షిణాసియా మహిళా అభివృద్ధి ఫోరం అధ్యక్షురాలు ప్రమీలా ఆచార్య రిజాయ్, భారత పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి బినయ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈడీ రత్నాకర్ అధికారి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇండస్ట్రియలైజేషన్‌పై సెషన్లు నిర్వహించారు. సదస్సులో సార్క్ దేశాల మహిళా పారిశ్రామికవేత్తలు తాము ఉత్పత్తి చేసిన వస్తువుల ప్రదర్శన, టెక్నాలజీ, యంత్రాలు, ఆహార ఉత్పత్తులను, సేంద్రియ ఎరువుతో పండించిన దినుసులను వివిధ స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ఆయా దేశాల మహిళలు తమ సంప్రదాయ వస్త్రధారణలతో సదస్సులో ఆకట్టుకున్నారు. చీరకట్టుతో భారత్, శ్రీలంక మహిళలు, తలకు చున్నీలు చుట్టుకుని మాల్దీవుల మగువలు, స్యూట్లను పోలిన దుస్తులతో బంగ్లాదేశ్ వనితలు, టీషర్టులు, జీన్ ఫ్యాంట్లు, చుడీదార్లతో మరికొందరు ప్రత్యేకంగా కనిపించారు. పురుషాధిక్యంతో మహిళల వెనకడుగు బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఉద్యోగం చేయాలని ఉన్నా చాలా మంది మహిళలు పురుషాధిపత్యం కారణంగా వెనకడుగు వేస్తున్నారని లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజస్టిక్స్ వ్యవస్థాపకారులు నిఖల్ అన్నారు. అదే మహిళలే పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే వారి వద్ద మహిళలకు ఎలాంటి అధిపత్య పోరు లేకుండా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళ పారిశ్రామిక సదస్సులో బుధవారం పాల్గొన్న ఆమె సాక్షితో మాట్లాడారు. ఇప్పటి వరకు తాను పనిచేసిన నాలుగు సంస్థల్లోనూ పురుషాధిపత్యం ఎదుర్కొన్నానని చెప్పారు. తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని 2014లో లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజస్టిక్స్ కంపెనీని సొంతంగా ప్రారంభించినట్టు వివరించారు. తన పరిశ్రమ ద్వారా మూడు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించానన్నారు. మహిళా సాధికారత కోసం ప్రతి మహిళకు శిక్షణ ఇచ్చేలా జాతీయ స్కిల్స్ అభివృద్ధి విభాగంతో ఒప్పందం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. అనుభవజ్ఞులతో శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకు పరిశ్రమ ఏర్పాటు సులభతరం అవుతుందన్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు సరైన గోదాములు లేకపోవటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఆహార భద్రత చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో స్టోర్స్‌ను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావించిందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గత నెలలో ఢిల్లీ, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో రూ.200 కోట్ల నిధులతో గోదాముల ఏర్పాటుకు పిలిచిన టెండర్లను తమ సంస్థ దక్కించుకుందన్నారు. అమరావతి వచ్చి సమస్య చెప్పుకోమన్నారు.. సీఎం సూచనపై దళిత మహిళా పారిశ్రామికవేత్త దివ్య ఆవేదన బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): దళిత మహిళలకు బ్యాంకులు, కార్పొరేషన్లు సహకారం అందించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి ఓ యువ దళిత పారిశ్రామికవేత్త దివ్య తీసుకెళ్లింది. మహిళా పారిశ్రామిక సదస్సులో పాల్గొన్న సీఎం తిరిగి వెళుతుండగా ఆమె కలిసి మాట్లాడింది. ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ ఇవ్వాలని కోరగా.. సీఎం స్పందిస్తూ ఇలాంటి ఏమైనా ఉంటే అమరావతి వచ్చి మాట్లాడు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్పొరేషన్లు, బ్యాంకులు పరిశ్రమల ఏర్పాటు కోసం కమీషన్లు అడుగుతున్నాయని, సీఎంకు చెబుదామంటే ఆయనేమో అమరావతి రావాలంటున్నారని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహం అవసరం తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టరో, ఇంజినీర్లు చేయాలని భావించకుండా పాఠశాల స్థాయి నుంచే పారిశ్రామికవేత్తగా ఎదిగేలా ప్రోత్సహించాలని సెంటర్ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూవర్ డెవలప్మెంట్ డైరెక్టర్ రూప మాగంటి అన్నారు. మహిళా పారిశ్రామికవేత్త సదస్సులో పాల్గొన్న ఆమె సాక్షితో మాట్లాడారు. ఇంటర్లో పారిశ్రామిక రంగంపై అవగాహన సదస్సులు, శిక్షణ ఇస్తే భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సంస్థను ముందుకు తీసుకొని వెళ్లగలుగుతారన్నారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసే వారు ఆరు నెలల నుంచి 12 నెలల వరకు శిక్షణ తీసుకోవాలన్నారు. పరిశ్రమలను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 3500 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారీ చేశామన్నారు. అమరావతిలో కొత్తగా తమ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆమె చెప్పారు. ఇటువంటి సదస్సుల వల్ల మిగతా దేశాల్లోని ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవచ్చన్నారు. ఆకట్టుకున్న ఉత్పత్తుల ప్రదర్శన బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. వస్త్రాలు, కాస్మొటిక్స్, డ్రైఫ్రూట్స్, గృహ అలంకరణాలు తదితర ఉత్పత్తుల గురించి సదస్సుకు హాజరైన ప్రతినిధులకు మహిళలు వివరించారు. ఈ సదస్సులో విదేశీ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారత్‌లో మహిళలు ప్రత్యేకం ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో మహిళలను ప్రత్యేకంగా చూస్తారని, అం దుకే వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆసక్తి చూపించడం లేదని యూఎస్ ఏకు చెందిన మైస్టిక్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఉజాలి అన్నారు. మహిళా పారిశ్రామిక సదస్సులో ఆమె పాల్గొని వర్చువల్ రియాలటీపై మాట్లాడారు. అనంతరం ఆమె సాక్షితో మాట్లాడుతూ ఓ మహిళ తన సొంతగా వ్యాపారం చేయాలని భావిస్తే భారత్‌లో వింతగా చూస్తారని, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను మహిళలు అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. మహిళలు ఇంకా ఎదగాలి.. సాక్షి, విశాఖపట్నం: ‘మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మరిన్ని అవకాశాల కోసం తపిస్తున్నారు..’అని అమెరికాలోని న్యూజెర్సీలో 20 ఏళ్ల నుంచి కూచిపూడి నృత్య శిక్షకురాలిగా ఉన్న స్వాతి అట్లూరి అభిప్రాయపడ్డారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళా సాధికారత ఒక్క మగువలకే కాదు.. సొసైటీకి కూడా అవసరమన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా తానెంతో నేర్చుకోవలసి ఉందని చెప్పారు. న్యూజెర్సీలో స్థాపించిన కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ద్వారా తాను ఇప్పటి దాకా 1500 మందికి పైగా శిక్షణ ఇచ్చానన్నారు. వీరిలో 90 శాతం మంది భారతీయులేనన్నారు. -
మన ఇంజనీర్లయితే ఇవ్వలేరు
సింగపూర్ ఇంజనీర్లు కాబట్టే సకాలంలో ఇచ్చారు.. మాస్టర్‌ప్లాన్‌పై సీఎం వ్యాఖ్య సంక్షోభంలోని పరిశ్రమలకు {పత్యేక ప్యాకేజీ ఇస్తాం పారిశ్రామికవేత్తల సదస్సులో వెల్లడి రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను భారతదేశంలోని ఇంజనీర్లు అయితే సకాలంలో ఇవ్వలేకపోయేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదే సింగపూర్‌కు చెందిన ఇంజనీర్లు కాబట్టే సకాలంలో ఇవ్వగలిగారని ఆయన అన్నారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన విషయంలో సింగపూర్ ఇంజనీర్ల సామర్ధ్యానికి ఇది నిదర్శనమన్నారు. మంగళవారం రాత్రి రాజమండ్రి ఆర్ట్స్‌కళాశాలలో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ద్వారా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. రాజమహేంద్రిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. అంతకుముందు రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న చక్కెర, టెక్స్టైల్, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను చక్కదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఆయా రంగాలను గుర్తించి వాటిని ఎలా మెరుగుపరచగలమనే విషయాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు సబ్సిడీలను ఎప్పటికప్పుడు ఇస్తామని తెలిపారు. పోర్టుల ఆధారంగా విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, భావనపాడులను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్, ఇసుజి ఉపాధ్యక్షుడు ఎస్ ఒకాబా యాషీలు తమ కంపెనీల ప్రజెంటేషన్లు ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై పెట్టుబడులు, మౌలికవసతుల శాఖ కమిషనర్ అజయ్‌జైన్ ప్రజెంటేషన్ సమర్పించారు. సన్‌రైజ్ ఏపీలో వ్యాపారావకాశాల గురించి ముద్రించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తల అసహనం... అత్యంత కీలకమైన సదస్సును పుష్కరాల రద్దీ సమయంలో రాజమండ్రిలో పెట్టడంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడ్డారు. లక్షలాది మంది జనం వస్తూ హోటళ్లు, రోడ్లు ఖాళీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టడం ఏమిటని కొందరు అసహనం వ్యక్తం చేశారు. సదస్సులో ఎవరికీ మాట్లాడే అవకాశం రాలేదు. ప్రభుత్వం, ఎంపిక చేసిన రెండు కంపెనీల ప్రజెంటేషన్లు తప్ప మిగిలిన వారిని పట్టించుకోలేదు. దీంతో ఈ సదస్సు ఎందుకు పెట్టినట్లని పారిశ్రామికవేత్తలు చర్చించుకోవడం కనిపించింది. కాగా పుష్కరాల అనంతరం ఉభయగోదావరి జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారిస్తామని సీఎం చెప్పారు. నరసాపురంలో పర్యటించిన ఆయన ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.