కోర్టులతోనే దాగుడు మూతలా? | Cheap stores Authorization | Sakshi
Sakshi News home page

కోర్టులతోనే దాగుడు మూతలా?

Oct 16 2015 2:30 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో చౌక దుకాణాల ఆథరైజేషన్‌ను ఇష్టారాజ్యంగా రద్దు చేస్తున్న రెవెన్యూ అధికారులు తప్పుడు వివరణలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదని హైకోర్టు ఆక్షేపించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చౌక దుకాణాల ఆథరైజేషన్‌ను ఇష్టారాజ్యంగా రద్దు చేస్తున్న రెవెన్యూ అధికారులు తప్పుడు వివరణలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకొనేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ న్యాయస్థానాలతోనే దాగుడు మూతలు ఆడుతున్నారంటూ మండిపడింది. ఇలాంటి అధికారులను ఏమాత్రం ఉపేక్షించరాదని, న్యాయపాలన పరిరక్షణకు వీరు శిక్షార్హులని తేల్చి చెప్పింది.

గుంటూరు జిల్లా బొల్లంపల్లి మండలం పేరూరుపాడులోని చౌక దుకాణం ఆథరైజేషన్‌ను రద్దు చేసిన వ్యవహారంలో బహిరంగంగా తప్పు ఒప్పుకొని, ఆ తరువాత మళ్లీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ ఎం.శ్రీనివాసరావు, బొల్లంపల్లి తహసీల్దార్ వి.రఘురాంకు కోర్టు ధిక్కారం కింద నెల రోజుల జైలు శిక్ష విధించింది. వీరిద్దరికీ రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు.

దీనిపై అప్పీల్‌కు వెళతామని, తీర్పు అమలును నిలిపివేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. న్యాయమూర్తి అంగీకరిస్తూ నాలుగు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement