సర్వే నంబర్ 44లో ఉన్న బోర్డు (ఫైల్)
మునగనూర్‌లో రూ.200 కోట్ల అసైన్డ్ భూ కుంభకోణం
సర్వే నంబర్ 44లోని 12 ఎకరాలు స్వాహా చేసిన రియల్టర్లు
అసైనీలు అనుభవంలో లేకపోవడంతో ఇతరుల పేరిట నకిలీ పత్రాల సృష్టి
అసెంబ్లీలో నిలదీసిన అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధి
మొత్తం 40 ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చిన రెవెన్యూ అధికారులు
తర్వాత రియల్టర్‌తో ఆ స్థానిక ప్రజా ప్రతినిధి, మరో ప్రజా ప్రతినిధి కుమ్మక్కు
వాటాలు కొలిక్కి..సహకారానికి సై.. ప్రాజెక్టు ముందుకు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్‌లో ఖరీదైన ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వాటిపై ‘పెద్ద’లు గద్దల్లా వాలిపోతున్నారు. ప్రజాప్రతినిధులు, రియల్టర్లు యథేచ్ఛగా దందా నడిపిస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు వారితో కుమ్మక్కై కాసులు దండుకుంటున్నారు. అంతా కలిసి పక్కా పథకం ప్రకారం అవసరమైన పత్రాలు సృష్టిస్తున్నారు. వందల కోట్ల విలువైన విలువైన భూమిని కూడా సునాయాసంగా కాజేస్తున్నారు. ఇదే కోవలో మునగనూర్‌లో రూ.200 కోట్ల విలువైన భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారు. రెండేళ్ల క్రితం వరకు ఇక్కడ ప్రభుత్వ భూమి అనే పెద్ద నోటీసు బోర్డు కూడా ఉండేది. కానీ ఈ ప్రభుత్వ భూమిని ఇటీవల పట్టా భూమిగా మార్చేశారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ పొజిషన్‌లో లేని కొత్త వారసులను తెరపైకి తెచ్చారు. వారి పేరున రికార్డులను సృష్టించారు. అయితే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని గుర్తించిన సీసీఎల్‌ఏ ఇప్పుడు కేసు నమోదు చేసి విచారిస్తోంది.
సర్కారీ భూమికి పట్టా..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్ రెవెన్యూ సర్వే నంబర్ 44, బై నంబర్లలో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇది 1954–58 చేసాలా పహాణీల్లోనూ గైరాన్, సర్కారీ భూమిగా నమోదై ఉంది. అయితే ఇందులో కొంత భూమిని గతంలోనే ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని అమ్మడం, కొనడం నేరం. సదరు అసైనీలకు ఆ భూమిని సాగు చేసుకుని జీవించే హక్కు మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ భూములను అమ్మినట్లు, కొన్నట్లు తేలితే వాటిని అసైన్డ్ ల్యాండ్స్ (పీఓటీ) యాక్ట్ 1977 కింద స్వాదీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. అయితే అసైనీల వద్ద ఉండాల్సిన భూమిలో 12 ఎకరాలు ఇటీవల ఓ రియల్టర్ చేతుల్లోకి వెళ్లింది.
తొలుత నిలదీత.. తర్వాత కుమ్మక్కు!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలకి వచ్చిన తొలినాళ్లలోనే..ఏళ్లుగా వివాదంలో ఉన్న ఈ భూములను పట్టా భూములుగా ఎలా మారుస్తారని ప్రస్తుత అధికార పార్టీకి చెందిన స్థానికప్రజాప్రతినిధి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. సర్వే నంబర్ 44/1లోని 8.39 ఎకరాలు, సర్వే నంబర్ 44/2లోని 4.25 ఎకరాలు, సర్వే నంబర్ 44/ 3 లోని ఒక ఎకరం, సర్వే నంబర్ 44/4లోని 7.16 ఎకరాలు, సర్వే నంబర్ 44/5లోని 18.10 ఎకరాలను మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ మేరకు ఐజీఆర్‌ఎస్ పోర్టల్‌లోనూ పొందుపరిచారు. అయితే అధికార పార్టీకి చెందిన ఆ స్థానిక ప్రజా ప్రతినిధి, ఆ పార్టీకే చెందిన మరో స్థానిక ప్రజా ప్రతినిధి పావులు కదిపారు. వాటాల కోసం ఒత్తిడి తెచ్చి రియల్టర్‌తో కుమ్మక్కయ్యారు. నాలా కన్వర్షన్, హెచ్‌ఎండీఏ అనుమతులు, నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించేందుకు అంగీకరించిన వీరికి.. మొత్తం ప్రాజెక్టులో 50 శాతం వాటా దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. వాటాల లొల్లి తేలిన నేపథ్యంలో సదరు రియల్టర్ ఓ నిర్మాణ సంస్థకు డెవలప్‌మెంట్‌కు కూడా ఇచ్చినట్లు సమాచారం. కాగా బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కానివ్వం
మునగనూర్ రెవెన్యూ సర్వే నంబర్ 44/2 సహా 44/4లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు ఇప్పటికే సీసీఎల్‌ఏ గుర్తించింది. దీంతో ఆయా భూములను నిషేధిత జాబితాలో చేర్చాం. సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వబోం. పట్టాదారులు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
– నారాయణరెడ్డి, కలెక్టర్, రంగారెడ్డి జిల్లా
1. సర్వే నంబర్ 44లో వెలిసిన బోర్డు(ఫైల్)
2. ఐజీఆర్‌ఎస్‌లో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లు
3. భూ భారతి ఫోర్టల్‌లో పట్టా భూమిగా రికార్డైన భూమి
4. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అడంగల్/పహాణి
నాటి కలెక్టర్ అండగా నిలిచారనే ఆరోపణలు
ప్రభుత్వం నుంచి భూములను పొందిన అసైనీలు అనుభవంలో లేకపోవడాన్ని ఆధారంగా చేసుకుని ఇతరుల పేరిట తప్పుడు పత్రాలు (ఎన్వోసీలు) సృష్టించి, భూములను స్వాహా చేశారు. 2022లో నాటి అదనపు కలెక్టర్ కూడా వీరికి అండగా నిలిచారని, రియల్టర్లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారనే ఆరోపణలున్నాయి. మొత్తం మీద విలువైన ప్రభుత్వ భూములు కాస్తా గుట్టుగా ప్రైవేటు పట్టా భూములుగా మారిపోయాయి. అయితే గత ప్రభుత్వ పెద్దల అండతో ఈ భూములను దక్కించుకున్న ఓ రియల్టర్.. ఆ తర్వాత ‘హస్తం’నేతకు దగ్గరయ్యారు.


