సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గనులు, భూగర్భ వనరుల శాఖ పరిధిలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీజుదారులు అనుమతులను మించి తవ్వకాలు సాగిస్తూ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తమకు కేటాయించిన భూభాగాన్ని దాటి ప్రభుత్వ, అటవీ, ప్రైవేటు భూముల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. తవ్విన పరిమాణాన్ని తక్కువగా చూపుతూ రాయల్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. ఒకే ట్రాన్సిట్ పాస్, వే బిల్లును పదే పదే ఉపయోగిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన రూ.వేల కోట్ల ఆదాయం పక్కదారి పడుతుండగా.. పర్యావరణం, భూగర్భ జలాలు, పంట పొలాలు, జీవ వైవిధ్యం దెబ్బతింటోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రానైట్, ఇసుక క్వారీలు అధికంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవస్థీకృతంగా సాగుతున్న మైనింగ్ దోపిడీలో అక్రమార్కులు, లీజుదారులకు కొందరు మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
సగానికి పడిపోయిన ఆదాయం
రాష్ట్రంలో బొగ్గు, ఇనుము, సున్నపురాయి, మాంగనీస్ వంటి ప్రధాన ఖనిజాలతో పాటు క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, లాటరైట్, డోలమైట్, బారైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, మార్బుల్, ఎర్త్, రోడ్ మెటల్స్, గ్రావెల్, సాధారణ ఇసుక వంటి మైనర్ మినరల్స్ (చిన్న ఖనిజాలు) కూడా ఉన్నాయి. గనులు, భూగర్భ వనరుల శాఖ లెక్కల ప్రకారం చిన్న ఖనిజాల కేటగిరీలో ప్రస్తుతం 198 మైనింగ్, 1,644 క్వారీ లీజులు ఉన్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత 2022–23లో రాష్ట్ర ఖజానాకు గరిష్టంగా ఖనిజ ఆదాయం రూ.7,705.53 కోట్లు సమకూరింది. ఆ తర్వాత మూడేళ్లుగా ఖనిజాదాయం శరవేగంగా పడిపోతూ రావడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గనుల శాఖ ప్రతీ ఏటా ఖనిజాదాయాన్ని రాబట్టేందుకు భారీగా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నా ఆశించిన లక్ష్యం చేరుకోక పోవవడం గమనార్హం. అక్రమాల కారణంగానే ఆదాయానికి గండి పడుతోందని తెలిసినా, లీజు హోల్డర్లు, కొందరు రాజకీయ నాయకులు, రెవెన్యూ, పోలీసు అధికారుల మద్దతుతో ఖనిజాదాయానికి గండి పడుతున్నా మైనింగ్ విభాగం నియంత్రించలేక పోతోంది.
2025–26లో రూ.3,998.51 కోట్లే..!
2022–23 నాటి ఆదాయంతో పోలిస్తే ఇటీవల ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.3,998.51 కోట్ల ఆదాయం (సుమారు 60%) మాత్రమే వచ్చింది. అంటే మూడేళ్లలో దాదాపు సగానికి రూ.3,707.02 కోట్ల మేర పడిపోయింది. 2023–24లో ఖనిజాదాయంలో ఏకంగా మైనస్ వృద్ధి (–29%) నమోదు కాగా 2024–25లో స్వల్పంగా మెరుగు పడి 1.24 శాతానికి చేరుకున్నా... 2022–23 నాటి ఆదాయం రూ.7,705 కోట్లతో పోలిస్తే –27.5%గా నమోదు అయ్యింది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు –40%తో ఖనిజాదాయం వృద్ధి రేటు మరీ క్షీణించింది. ఇదిలావుంటే 2026–27లో గనులు, భూగర్భ వనరుల ద్వారా రూ.7,150 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడం గమనార్హం.
ప్రభుత్వ విభాగాల నడుమ సమన్వయ లోపం
ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదికల ప్రకారం 2025లో క్వారీల్లో 15 చోట్ల తనిఖీలు చేసి 30 లక్షల టన్నుల మేర అదనపు క్వారీయింగ్ జరిగినట్లు గుర్తించి రూ.30 కోట్ల జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్‌పై గడిచిన ఆరు నెలల్లో 70 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. 2,131 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసి పలు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లేమి, ప్రభుత్వ విభాగాల నడుమ సమన్వయ లోపం కూడా అక్రమార్కులకు వరంగా మారుతోందని, అక్రమ క్వారీయింగ్‌ను గుర్తించే లోపే ఖనిజ సంపద పక్కదారి పడుతోందని, ఆదాయానికి గండిపడుతోందని అంటున్నారు.
అధికారులు, సిబ్బంది లేరంటున్న గనుల శాఖ
అక్రమ మైనింగ్‌ను అరికట్టి ఆదాయ లక్ష్యాలను సాధించేందుకు సరిపడా అధికారులు, సిబ్బంది తమ విభాగంలో లేరని గనులు, భూగర్భ వనరుల శాఖ చెప్తోంది. అక్రమ మైనింగ్, క్వారీయింగ్, రవాణాను అరికట్టి ఆదాయం సమకూర్చేందుకు సహకరించాల్సిందిగా కోరుతూ 2024 ఫిబ్రవరిలోనే గనుల శాఖ డైరక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు విభాగానికి లేఖ రాయడం గమనార్హం. కాగా దీనిని అడ్డు పెట్టుకుని కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఒక్కో వాహనంపై ఐదేసి వేల చొప్పున పోలీసు అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తరచూ బదిలీలతో..
గనుల శాఖలో తరచూ జరిగే బదిలీలు విభాగం పనితీరుపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయ లక్ష్యాలను చేరుకోకపోవడం, వివాదాస్పద పనితీరు వంటి కారణాలతో పాటు రాజకీయ ఒత్తిళ్లతో బదిలీలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ వ్యవహారాలు, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇసుక వెలికితీత, విక్రయాలు, రవాణాలో అక్రమాలు అధికారుల బదిలీల్లో కీలకంగా మారాయని తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఇసుక క్వారీల లీజ్‌ల కోసం చేసిన ఒత్తిళ్ల వల్ల ఒకరిద్దరు టీజీఎండీసీ అధికారులు నిష్క్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బదిలీతో మహేశ్ దత్ ఎక్కా బదిలీపై వచ్చారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎక్కా స్థానంలో గనుల శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. తర్వాత సురేంద్ర మోహన్ బదిలీతో ప్రస్తుతం పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎన్.శ్రీధర్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024 జనవరిలో గనుల శాఖ డైరక్టర్‌గా ఉన్న కాత్యాయని దేవి స్థానంలో బీవీఆర్ సుశీల్‌కుమార్‌ను నియమించారు. అదే ఏడాది డిసెంబర్‌లో కె.శశాంక బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరగకమునుపే శశాంక స్థానంలో క్రాంతి వల్లూరును ఇన్‌చార్జిగా నియమించారు. ప్రస్తుతం భవేశ్ మిశ్రా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.
కోకాపేటలో కరుగుతున్న కొండలు
గ్రేటర్ హైదరాబాద్ జీఓ 111 పరిధిలోని కోకాపేటకు సమీపంలో ఉండే కొండలు, గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్‌తో కొండలను పేల్చేస్తున్నారు. మొబైల్, ఫిక్డ్స్ క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ (ఆర్‌ఎంసీ) ప్లాంట్లు ఏర్పాటు చేసి ముడి సరుకును తరలిస్తున్నారు. ఒక్క శంషాబాద్ మండలం పరిధిలోనే సుమారు 20 అక్రమ ఆర్‌ఎంసీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లకు మైనింగ్ లీజు, కాలుష్య నియంత్రణ మండలి ఎన్‌ఓసీ, స్థానిక సంస్థలు, విద్యుత్, రెవెన్యూ శాఖ అనుమతులు వంటివి ఏవీ లేకుండానే కొండలు తొలిచేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కోకాపేట్‌లోని ప్రభుత్వ భూమిలో ఒక నిర్మాణ సంస్థ 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేసినా రాయల్టీ ఫీజు చెల్లించలేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడింది.
కిన్నెరసానిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరిలో, కిన్నెరసాని రిజర్వాయర్‌లో అధికారిక ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వాటిల్లో రాత్రి పగలు తేడా లేకుండా లెక్కపత్రం తెలియకుండా ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో కిన్నెరసాని సహజ స్వరూపం దెబ్బతింటోందనే విమర్శలు విన్పిస్తున్నాయి.


