పీజీఆర్‌ఎస్‌లో భూ సమస్యల ఫిర్యాదులపై ఓ మంత్రి సోదరుడు, అనుచరుల కన్ను
తాము పరిష్కరిస్తామంటూ ఫిర్యాదుదారులతో బేరసారాలు
సగం ధరకే భూములు కొట్టేసేయత్నం.. మధురవాడ,పెందుర్తి, ఆనందపురం, సబ్బవరంలోని లిటిగేషన్ వ్యవహారాలపై దృష్టి
వారికి ఒక రిటైర్డ్ అధికారి సూచనలు, సలహాలు.. కీలకంగా చక్రం తిప్పుతున్న ఓ మంత్రి ఓఎస్‌డీ
డీ–పట్టా భూముల్లోనూ ఇదే దందా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మా భూమి రెవెన్యూ రికార్డులో ఇబ్బందులున్నాయి. నాకు ఎప్పుడో పట్టా ఇచ్చారు. అయితే ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమి అని ఉంది. పరిష్కరించండి.. అంటూ విశాఖ మధురవాడకు చెందిన ఒక వ్యక్తి విశాఖ కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఫలానా మంత్రి పేషీ నుంచి అంటూ అతడికి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఓ మంత్రి సోదరుడు, ఓఎస్‌డీ అంటూ కొందరు ఫోన్‌చేసి ఏకంగా అతడి ఇంటికి వెళ్లారు. మీ భూమి సమస్యలను మేం పరిష్కరిస్తాం.. సగం ధరకే మాకివ్వండి.. అంటూ బేరసారాలాడారు. తనకు ఈ సమస్య ఉందని ఏకంగా అమరావతిలోని మంత్రికి ఎలా తెలిసిందో అర్థంగాక ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఆనందపురం, సబ్బవరం, భీమిలిలో డీ–పట్టాలు ఉన్న పలువురు రైతులతోను ఇదే తరహాలో ఓ మంత్రి సోదరుడు, పీఏ అంటూ చర్చలు జరుపుతున్నారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం త్వరలో రెగ్యులరైజ్ చేస్తుందని, మీ భూములను మేం చూసుకుంటామంటూ బేరసారాలు ఆడుతున్నారు. అడ్డకు పావుసేరు ధరకే బేరసారాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. లేదంటే భూసమీకరణ కింద మీ భూములు తీసుకుంటారంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
ఇవే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో భూమి ధరలు బాగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి సోదరుడు, ఓఎస్‌డీ, పీఏలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా మధురవాడ, ఆనందపురం, సబ్బవరం, భోగాపురం, అచ్యుతాపురం ప్రాంతాల్లోని విలువైన భూముల విషయంలో తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమికి సంబంధించి ఎవరైనా తమకు సమస్య ఉందంటూ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సదరు మంత్రి అనుచరగణం వాలిపోతోంది. నేరుగా ఫిర్యాదులో పేర్కొన్న నంబరుకు ఫోన్‌చేసి ‘మీ సమస్య మాకు తెలుసు. మేం విశాఖకు వచ్చి మీతో మాట్లాడతాం’ అంటూ మంత్రి పీఏ పేరుతో కాల్స్ చేస్తున్నారు. ఇక డీ–పట్టా భూముల విషయంలోను మీ భూమి భూసేకరణలో పోతుందంటూ భయాందోళనకు గురిచేసి, తక్కువ ధరకే తమ పేరులతో ఒప్పందం రాయించేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఒక అధికారి ఈ వ్యవహారంలో మొన్నటివరకు వారికి సహకరించారు.
ఫిర్యాదు కాపీ ఎలా వెళుతోంది?
వాస్తవానికి కలెక్టరేట్‌లోనో, తహశీల్దారు కార్యాలయంలోనే సోమవారం బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత.. ఫోన్ నంబర్లతో సహా ఆ వివరాలు మంత్రి పేషీకి వెంటనే చేరిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఉద్యోగ విరమణ చేసిన ఓ అధికారితో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ రిటైర్డ్ అధికారికి స్థానిక రెవెన్యూ అధికారులతో ఉన్న సంబంధాలతోనే మంత్రి పేషీకి సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూముల విషయాలతో పాటు ఏయే పనులు అవుతాయనేది కూడా స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం ఉండటంతో పక్కాగా మంత్రి అనుచరులు రంగంలోకి దిగి భూదందాలు సాగిస్తున్నట్టు అర్థమవుతోంది.
ఓఎస్‌డీదే పైచేయి
వాస్తవానికి ఆ రిటైర్డ్ అధికారిని భూలావాదేవీల వ్యవహారాలు పరిశీలించేందుకు మంత్రి ప్రత్యేకంగా నియమించుకున్నారు. అధికారికంగా నియామకపత్రం లేకుండానే ఆ రిటైర్డ్ అధికారి గత మూడునెలలు సేవలందించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వివాదాస్పద భూములున్నాయి? ఏయే అంశాల్లో రికార్డులను మార్చి వ్యవహారం నడిపించవచ్చనే విషయాలపై మంత్రికి సలహాలిచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాల విషయంలో మంత్రి ఓఎస్‌డీకి, ఆ రిటైర్డ్ అధికారికి మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. వారం రోజుల కిందట ఆ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో.. రిటైర్డ్ అధికారిని ఇంటికి సాగనంపారు. రిటైర్డ్ అధికారి ఇచ్చిన సలహాలు, సూచనలతోనే విశాఖలోని భారీ విలువ చేసే భూముల వ్యవహారంలో మంత్రి తమ్ముడు, ఓఎస్‌డీ, పీఏలు భారీగా దందాలు కొనసాగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


