‘పెద్ద కొండలు’పై వాలిన టీడీపీ గద్దలు
ప్రభుత్వ భూమికి పట్టాలు.. గుట్టుగా ప్రైవేటు సర్వే..
150 ఎకరాలను కాజేసేందుకు కుట్ర
కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే పీఏలు, అధికారులకు తలా 20 ఎకరాలు
బినామీ పేర్లతో తప్పుడు రికార్డుల సృష్టి
సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
ఓ సంస్థకు కూతవేటు దూరంలో దురాగతం
భూమి విలువ రూ.450 కోట్లకు పైమాటే !
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే విశాఖలోని కొండలకు గుండు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని.. అధికారపార్టీ నేతలూ ఓ సంస్థకు కూతవేటు దూరంలో కొండల కబ్జాకు కుట్రపన్నుతున్నారు. పెద్ద కొండలపై గద్దల్లా వాలేందుకు జంకుబొంకు లేకుండా సిద్ధమవుతున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని శొంఠ్యాం గ్రామ పరిధిలో సర్వే నంబరు 346, 347లల్లో 469.9 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను పెద్ద కొండలుగా స్థానికులు పిలుస్తుంటారు. ఇవి పచ్చని చెట్లతో విస్తరించి ఉండడంతో అనేక అడవి జంతువులకు స్థావరంగా ఉన్నాయి. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ కొండలపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. దీంతో ఒక కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే పీఏలు ఇద్దరు, రెవెన్యూ అధికారులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. కొండలను కేకుల్లా కట్‌చేసుకుని చేజిక్కించుకునేందుకు ఇప్పటికే డ్రోన్లతో ప్రైవేటు సర్వే చేశారు.
మొత్తం 469.9 ఎకరాల్లో 150 ఎకరాల భూమికి కొద్ది మంది రైతుల సాగులో ఉన్నట్టుగా బినామీల పేర్లతో దొంగ పట్టాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఎవరి పేరుతో ఎంత భూమి తీసుకోవాలనే లెక్కలు వేసుకున్నారు. బినామీ పేర్లతో తలా 20 ఎకరాల చొప్పున కాజేతకు కుట్రపన్నుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొండల్లో రాళ్లు కూడా పాతినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.3 కోట్ల మేర పలుకుతుంది. అంటే మొత్తం 150 ఎకరాల భూమి విలుఉవ సుమారు రూ.450 కోట్లకుపైగా విలువ చేస్తుందన్నమాట. ఈ వ్యవహారంలో స్థానిక కూటమి నేతలకు కూడా ఐదు నుంచి పది ఎకరాల చొప్పున వాటా ఇస్తున్నట్టు సమాచారం. ఇక రెవెన్యూ అధికారులకు కూడా వారి వాటాగా వారికి 10 ఎకరాలు చొప్పున పంచుకున్నట్టు తెలుస్తోంది.
భూ సమీకరణ పేరుతో లబ్ధి పొందేందుకే!
వాస్తవానికి ఈ కొండ దిగువన ఇప్పటికే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అక్కడ సాగులో ఉన్న రైతులకు నిబంధనల మేరకు ఎకరాకు 900 గజాల చొప్పున లే–అవుట్ వేసి మరీ అప్పగించింది. ఈ లే–అవుట్‌కు ఆనుకునే ఈ పెద్ద కొండలు ఉన్నాయి. ఈ కొండలను కూడా త్వరలో వీఎంఆర్‌డీఏ ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఇందుకోసం త్వరలో గ్రామ సభను నిర్వహించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న సదరు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఇద్దరు పీఏలు, రెవెన్యూ యంత్రాంగం ఈ కబ్జా కుంతంత్రానికి తెరలేపారు. తమ బినామీల పేర్లను జాబితాలో చూపెట్టి.. సాగులో ఉన్నట్టు తప్పుడు రికార్డులను సృష్టించి ల్యాండ్ పూలింగ్‌లో ఎకరాకు 900 గజాల స్థలాన్ని కాజేసేందుకు ఈ తతంగమంతా నడిపిస్తున్నట్టు అర్థమవుతోంది. తద్వారా సదరు కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు పీఏలతో పాటు రెవెన్యూ అధికారులు కాస్తా తమ బినామీ పేర్లతో ఏకంగా తలా 18 వేల గజాల స్థలాన్ని వీఎంఆర్‌డీఏ నుంచి తీసుకుని.. అనంతరం బినామీల నుంచి కొన్నట్టు చూపి తమపరం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోంది.


