వచ్చే నెల నుంచి పెంపునకు సన్నాహాలు
11 నెలల్లోనే రెండోసారి స్థిరాస్తుల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు
గత ఫిబ్రవరిలోనే 50 శాతం పెంచిన చంద్రబాబు ప్రభుత్వం
దీంతో ఆస్తుల క్రయవిక్రయాల సమయంలో ప్రజలు లబోదిబో
అదేమీ పట్టకుండా మళ్లీ రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయమే లక్ష్యంగా చర్యలు?
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ.. ప్రతిపాదనలు పంపాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు
భూముల క్లాసిఫికేషన్‌ను మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు
విలువల సవరణ అత్యవసరమని చెబుతూ సబ్ రిజిస్ట్రార్ల సెలవులు రద్దు
వాస్తవానికి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మందగించిన అభివృద్ధి
రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా తగ్గిన ఆదాయం
ప్రజలపై చార్జీల బాదుడుతో ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం
వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఏటా రూ.10 వేల కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం
చంద్రబాబు సర్కారు వచ్చాక రూ.8 వేల కోట్లకు పడిపోయిన వైనం
గత ఏడాది చార్జీలను ఏకంగా 50 శాతం పెంచడంతోనే ఈ మాత్రం రాబడి
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పని చేయలేక చేతులెత్తేశారు. ఓవైపు ఎడాపెడా అప్పులు చేస్తూ... మరోవైపు ప్రజలపై పన్నుల మీద పన్నులు బాదుతూ వారి నడ్డి విరుస్తున్నారు. చేస్తానన్న మేలును విస్మరించి... అడ్డగోలుగా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఒకదాని వెంట ఒకటి భారం వేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది తిరగకుండానే రిజిస్ట్రేషన్ల చార్జీలను రెండోసారి సవరించేందుకు సబ్ రిజిస్ట్రార్లకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు సర్కారు గత ఏడాది ఫిబ్రవరిలోనే స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచింది.
గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం, పట్టణాల్లో 50–60 శాతం మేర సవరించింది. ఇంత భారీగా చార్జీల పెంపుతో ఆస్తుల క్రయవిక్రయాల సమయంలో ప్రజలు లబోదిబో అంటున్నారు. కానీ, అడ్డగోలుగా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు సర్కారుకు ఇదేమీ పట్టడం లేదు. చార్జీలను ఇంకా పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచే దీనిని అమలు చేసేందుకు సన్నాహాలు సాగిస్తోంది.
సర్వే నంబర్ల వారీగా విలువల సవరణ
చార్జీల పెంపు ఉద్దేశంలో భాగంగా ఇటీవల అన్ని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా పలు సూచనలు జారీ చేశారు. వారి పరిధిలోని స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణకు అవసరమైన పూర్తి డేటా సేకరించాలని పేర్కొన్నారు. అందులో ప్రధానంగా నాలా మార్పిడి చేసిన సర్వే నంబర్లు, జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులు, జెడ్పీ, మండల పరిషత్ రోడ్లకు ఆనుకుని ఉన్న భూముల సర్వే నంబర్లను రెవెన్యూ అధికారుల నుంచి వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల నుంచి కొత్తగా చేర్చిన వాణిజ్య డోర్ నంబర్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు (సీఆర్‌డీఏ, తుడా, ఉడా తదితర) లేదా స్థానిక సంస్థల ద్వారా ఏర్పడిన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ల సర్వే నంబర్ల వివరాలను కూడా సేకరించాలని స్పష్టం చేశారు.
రెండు రోజుల్లో ఇదంతా పూర్తిచేసి ఆ సర్వే నంబర్లలో మార్కెట్ విలువల పెంపునకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఇందుకోసం నాలుగు రకాల ఫార్మాట్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్లకు పంపింది. వాటి ప్రకారం సర్వే నంబర్ల వారీగా ఏ ప్రాంతాల్లో ఎంతమేర పెంచాలో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రతిపాదనలను నాలుగు రోజుల్లోపు జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని రివిజన్ కమిటీల ముందుంచి ఆమోదం తీసుకోవాలని, అనంతరం అన్ని జిల్లాల డీఐజీ కార్యాలయాలకు సమర్పించాలని పేర్కొన్నారు.
భూముల క్లాసిఫికేషన్ల మార్పు...
భూముల క్లాసిఫికేషన్‌ను మార్చేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేకంగా మరో అంతర్గత ఆదేశం ఇచ్చారు. క్లాసిఫికేషన్ మార్పు అంటే... ఒకే ప్రాంతంలో ఒక రేటు కాకుండా సర్వే నంబర్లవారీగా భూముల క్లాసిఫికేషన్ చేయాలని చెబుతున్నారు. దీంతో మార్కెట్ విలువలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సవరణ ప్రక్రియను అత్యంత అత్యవసర, ప్రాధాన్య కార్యక్రమంగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. అది పూర్తయ్యేదాక సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు.
మందగించిన అభివృద్ధి.. పడిపోయిన ఆదాయం
ఫిబ్రవరి తొలి రోజుల్లోనే స్థిరాస్తుల మార్కెట్ విలువలు పెంచేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. తక్కువలో తక్కువ రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా సవరణ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో అభివృద్ధి మందగించింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పడిపోయి రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చార్జీల పెంపు ద్వారా ప్రజల ముక్కుపిండి వసూలు చేసి నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సిద్ధమైంది.
వైఎస్ జగన్ పాలనలో ఏటా రూ.10 వేల కోట్ల రాబడి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఏడాదికి రూ.10 వేల కోట్లు ఉన్న రిజిస్ట్రేషన్ల ఆదాయం చంద్రబాబు సర్కారు వచ్చాక రూ.8 వేల కోట్లకు పడిపోయింది. అదికూడా గత ఏడాది రిజిస్ట్రేషన్ల చార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచడంతో ఆ మాత్రం ఆదాయమైనా వచ్చింది. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ విలువలను సవరించి... ఆదాయం పెరిగినట్లు చూపించేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు.
వచ్చే నెల నుంచి పెంచేందుకు సన్నాహాలు
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు... ఇప్పటికే పలు విధాలుగా ప్రజలపై రూ.20,135 కోట్ల భారం మోపారు. వాహన కొనుగోళ్లపై జీఎస్టీ శ్లాబ్‌ను కేంద్ర ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా... రాష్ట్ర ప్రజలకు ఆ ఉపశమనం లేకుండా ఏకంగా పది శాతం రోడ్ సెస్ విధించారు. తద్వారా ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్లను దండుకునేందుకు సిద్ధమయ్యారు. పండుగ పూట మందుబాబులకు ఝలక్ ఇస్తూ ప్రతి బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచేశారు. ఇప్పుడు మరో బాదుడుకు తయారవుతున్నారు. ఏడాదిలోపే రెండోసారి రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచేందుకు వేగంగా కసరత్తులు సాగిస్తున్నారు.


