దేశీ ఐటీకి వీసా కష్టాలు | After Infosys visa row, other IT companies under US scanner | Sakshi
Sakshi News home page

దేశీ ఐటీకి వీసా కష్టాలు

Nov 6 2013 12:44 AM | Updated on Apr 4 2019 5:12 PM

దేశీ ఐటీకి వీసా కష్టాలు - Sakshi

దేశీ ఐటీకి వీసా కష్టాలు

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వీసాల వివాదాన్ని పరిష్కరించుకున్న నేపథ్యంలో వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని సందేహాలున్న మరిన్ని భారత ఐటీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

 న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వీసాల వివాదాన్ని పరిష్కరించుకున్న నేపథ్యంలో వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని సందేహాలున్న మరిన్ని భారత ఐటీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీల ఉల్లంఘనలను పరిశీలిస్తున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ(యూఎస్‌ఐసీఈ) వర్గాలు వెల్లడించాయి. అయితే, అభియోగాలు ఇంకా నిర్ధారణ కాని నేపథ్యంలో ఆయా కంపెనీల పేర్లను వెల్లడించడానికి నిరాకరించాయి. భారత ఐటీ రంగానికి అమెరికా అతి పెద్ద మార్కెట్. దేశీ ఐటీ సంస్థల ఆదాయాల్లో సుమారు 60 శాతం పైగా అమెరికా నుంచే వస్తోంది.
 
 గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 75 బిలియన్ డాలర్ల ఐటీ సర్వీసులను ఎగుమతి చేశాయి. ప్రస్తుతం  టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి అనేక భారత ఐటీ దిగ్గజాలు.. అమెరికాలోని తమ క్లయింట్లకు సర్వీసులు అందించేందుకు వర్క్ వీసాలపై ఆధారపడుతున్నాయి. ఇప్పటికే వీసాల ఫీజుల పెంపు తదితర అంశాలతో నిబంధనలను అమెరికా కఠిన తరం చేస్తుండటంతో వాటిని సడలించేలా చూసేందుకు ఐటీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వస్తే మరో కొత్త సమస్య ఎదుర్కోనున్నాయి. తాము నిబంధనలన్నింటినీ పక్కాగా పాటిస్తున్నామని స్పష్టం చేసిన పలు ఐటీ కంపెనీలు.. విచారణపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.
 
 3.4 కోట్ల డాలర్లతో ఇన్ఫీ వివాదం సెటిల్‌మెంట్..
 వీసాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న ఇన్ఫోసిస్..సుమారు 3.4 కోట్ల డాలర్లు చెల్లించడం ద్వారా సెటిల్మెంట్ చేసుకోవడం తెలిసిందే. అయితే, తామెలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని ఇన్ఫీ స్పష్టం చేసింది. హెచ్1బీ వీసాలకు బదులు.. చౌకగా ఉండే బిజినెస్ విజిట్ వీసాలు తీసుకుని అమెరికాలో క్లయింట్లకు సర్వీసులు అందించిందనేది ఇన్ఫీపై ఆరోపణ. దీనిపై 2011లో విచారణ మొదలై ఇటీవల సెటిల్మెంట్ జరిగింది. సాధారణంగా.. అమెరికాలో క్లయింట్లకు సేవలందించేందుకు పంపే భారతీయ ఉద్యోగుల కోసం దేశీ కంపెనీలు హెచ్1బీ వర్క్ వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఫీజు కాస్త ఎక్కువ. దీంతో, హెచ్1బీ వీసాలకు బదులుగా చౌకగా ఉండే బిజినెస్ విజిట్ వీసాలు(బీ1) తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్లకు సేవలు అందిస్తున్నాయని దేశీ ఐటీ కంపెనీలపై ఆరోపణలు వస్తున్నాయి. పలు విదేశీ కంపెనీలు వీసా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు తమ ఉద్యోగులను తీసుకొస్తూ.. అమెరికన్ల ఉద్యోగావకాశాలకు గండి కొడుతున్నాయనేది సెనేటర్ చక్ గ్రాస్‌లీ ఆరోపణ. బీ1 వీసాలు దుర్వినియోగం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఫీ ఉదంతం తర్వాత మరిన్ని జరిమానాలు, శిక్షలు ఒకవేళ లేకపోయినా.. ఐటీ కంపెనీలపై ఎంతో కొంత ప్రభావం ఉంటుందని ఇమిగ్రేషన్ వర్గాలు పేర్కొన్నాయి. మరింత తరచుగా నిబంధనలను పాటిస్తున్నట్లు నివేదికలు సమర్పించాల్సి రావొచ్చని తెలిపాయి.
 
 భయాలు అక్కర్లేదు: నాస్కామ్: ఇన్ఫోసిస్ వివాదం చాలా పాతదని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ పేర్కొన్నారు. గత 3-4 ఏళ్లుగా భారత ఐటీ కంపెనీలు వీసాల అంశంపై అమెరికా ప్రభుత్వాధికారులు, కాన్సులర్‌తో చర్చలు జరుపుతూనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వివాదాలేమీ తలెత్తకపోవచ్చునని మిట్టల్ అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement