పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు, అతడి స్నేహితులు కలిసి అత్యాచారం చేసి.. తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశారు.
నిర్భయ ఉదంతం జరిగింది.. దోషులకు శిక్ష పడింది.. అయినా దేశంలో అత్యాచారాల పర్వం ఆగలేదు. నేరాలకు దేశంలోనే పెట్టింది పేరయిన ఉత్తరప్రదేశ్లో తాజాగా మరో ఘోరం జరిగింది. పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు, అతడి స్నేహితులు కలిసి అత్యాచారం చేసి.. తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశారు. ఈ సంఘటన మీరట్ సమీపంలోని లిసాడి గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
సోమవారం మధ్యాహ్నం ఆ బాలిక ఇస్లాంనగర్లోని మదర్సాలో తరగతులకు వెళ్లేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లింది గానీ, మళ్లీ ఇంటికి తిరిగి రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఎంతకూ రాకపోవడంతో పోలీసులు గాలింపు జరపగా, బాలిక మృతదేహం కనపడింది. ఆమె మెడ చుట్టూ ఓ తువ్వాలు చుట్టి ఉంది, పీక నొక్కేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. అలాగే ఆమె నుదుటి మీద కూడా గాయాలు ఉన్నాయి.
మృతదేహం అక్కడకు దూరంగా పర్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కనిపించింది. ముందుగా ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడితో పాటు.. బాలికతో కలిసి మదర్సాకు వెళ్లిన ఇద్దరు స్నేహితులను కూడా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


