
జననేత జగన్‌పై దాడికి నిరసనగా బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
సాక్షి,సిటీబ్యూరో: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ దాడికి నిరసనగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ డీజీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతకు ముందు విశాఖపట్నంలో జగన్‌పై దాడి అనంతరం ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు తెలుసుకుని అభిమానులు భారీ ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయన విమానం దిగి లాంజ్‌లోకి రాగానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నట్టు జగన్ సంకేతాలిచ్చారు. ఆయన కాన్వాయ్‌లో బయలుదేరగా అభిమానులు కూడా వెంటే బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ కూడా రోడ్డుపై బైఠాయించి ఏపీ డీజీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాగా వైఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని జగన్‌మోహన్‌రెడ్డిని పరామర్శించారు. ఇదిలా ఉండగా జగన్‌మోహన్‌రెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రితో పాటు ఆయన నివాస ప్రాంతంలోనూ నగర పోలీసులు భద్రతను పెంచారు.