సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..

Women Should Focus On Professional Development Says Kishan Reddy - Sakshi

మహిళలు నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టాలి: కిషన్‌రెడ్డి

ముషీరాబాద్‌: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్‌ డెవలప్‌మెంట్‌’సంస్థను లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు.

మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్‌ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top