రమణంపల్లి పునర్నిర్మాణానికి అడుగులు

Villages Development With Charity Organization Rangareddy - Sakshi

మాడ్గుల: వంద సంవత్సరాల క్రితం కనుమరుగైన రమణంపల్లి గ్రామం పునర్నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచి వివిధ గ్రామాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ముందుకు వస్తున్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి–ఆర్కపల్లి గ్రామాల సమీపంలో రమణంపల్లి గ్రామం ఉన్నట్లు రికార్డుల్లో మాత్రమే పేర్కొనబడి ఉంది. ఆ గ్రామంలో పూర్వం అంటువ్యాధుల బారిన పడడంతో స్థానికులు గ్రామాన్ని వదిలిపెట్టి సుద్దపల్లి, ఆర్కపల్లికి వెళ్లి అక్కడే తలదాచుకుని కాలక్రమేణ ఆయా గ్రామాల్లోనే స్థిరపడ్డారు. అయితే వారు తమ పూర్వీకుల గ్రామాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రమణంపల్లి గ్రామం ఉన్న ప్రదేశాన్ని గతంలో గ్రామీణ పునర్‌నిర్మాణ సంస్థ (వీఆర్‌ఓ) వారు కొనుగోలు చేసి ఆ సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు స్థానికుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ స్థలంలో మొదటి విడత 20 మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికే ఆ సంస్థ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మిగతా వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో లబ్ధి పొందిన కుటుంబాలు సైతం పరిసర ప్రాంతంలో పెద్ద అడవి ఉందన్న భయంతో ఇళ్లలోకి వెళ్లలేదు. దీంతో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. కాగా, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారి కుటుంబీకుల పేర విరాసత్‌ కావడంతో సదరు వ్యక్తులు తమ సొంత ఆస్తులుగా భావిస్తూ తమను ఇళ్లకు రానివ్వడం లేదని లబ్ధిదారుల వారసులు ఆరోపిస్తున్నారు. 

మాకు కేటాయించిన ఇళ్లను అçప్పగించాలి  
మాకు గతంలో వీఆర్‌ఓ సంస్థ వారు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. దొంగలు, అడవి జంతువుల బెడదతో పాటు విద్యుత్‌ సౌకర్యం లేదని మేము ఇళ్లలోకి వెళ్లలేదు. ప్రస్తుతం ఆ భయం లేనందును మాకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్తాం. మా ఇళ్లను కొంతమంది కబ్జా చేసుకుని స్థలం తమదేనంటూ బెదిరిస్తున్నారు.  –ఏదుల రాములమ్మ, సుద్దపల్లి 
 
వారసులకు ఇళ్లు ఇప్పించేందుకు కృషి  
గతంలో వీఆర్‌ఓ సంస్థ వారు డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల వారసులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషిచేస్తున్నాం. సంస్థ కొనుగోలు చేసిన భూమికి సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు వ్యక్తులను గార్డియన్‌గా పెడితే వారి వారసులు భూమి తమదని చెప్పడం విడ్డూరం. గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి సంస్థ సహకారంతో డబుల్‌బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం.  – యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, సర్పంచ్, సుద్దపల్లి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top