రోడ్లపై వాహనాలు.. హెచ్చరికలు ఉల్లంఘన

Vehicles On Road In Hyderabad Not Fallows Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. హైదరాబాద్‌లో సామవారం ఉదయం నుంచి  ఆటోలు, ప్రైవేటు వాహనాలు యదేచ్చగా తిరుగుతున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజు మాత్రం ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించారు. భారతీయ రైల్వేతో పాటు తెలంగాణ ఆర్టీసీని కూడా మూసివేయడంతో ప్రైవేటు వాహనాలు సొమ్ముచేసుకునేందుకు ఇదే సమయంగా భావించి ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. ఒక్కో వాహనంలో ఐదునుంచి ఆరుగురు వరకు ఎక్కించుకుని వెళ్తున్నారు. పలుచోట్ల పోలీసులు నియంత్రించినప్పటికీ.. పూర్తి స్తాయిలో మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. (కరోనా అలర్ట్‌ : మూడో దశకు సిద్ధమవ్వండి!)

వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టకు ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ప్రభుత్వం, వైద్యులు హెచ్చరించినా.. పాటించాల్సిన జాగ్రత్తలను గాలికొదిలేశారు. సామాజిక దూరం పాటించాలని ఓవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. షాపింగ్‌మాల్స్‌, నిత్యవసర దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుంపులుగా నిలుచుని ఉన్న ఘటనలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల మద్యం దుకాణాలు కూడా తెరిచి.. ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. (మహిళా కానిస్టేబుల్‌కు కరోనా లక్షణాలు?)

మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు వాహనాలు బయటకు రావద్దని ప్రభుత్వం ప్రకటించినా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. అయితే టోల్ గేట్లు మూసి.. కేవలం అంబులెన్సులను మాత్రమే వదులుతున్నారు. గూడ్స్ వెహికల్స్‌, నిత్యవసర వస్తువులు, కూరగాయలు ఉల్లిగడ్డ, పాలు పెరుగు ఉన్న వాహనాలను కూడా వదులుతున్నారు. తెలంగాణ నుంచి విజయవాడ వైపు పెద్ద ఎత్తున వెళ్తున్న ప్రైవేటు లారీలు, కార్లను మాత్రం పక్కనే ఉన్న మైదానంలో టోల్‌ సిబ్బంది పార్క్‌ చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 31 వరకు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్‌  ఇచ్చి తిరిగి వెనక్కి పంపుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top