కరోనా అలర్ట్‌ : మూడో దశకు సిద్ధంగా ఉండండి

India Get Ready For Prepare For Stage Three Over Coronavirus - Sakshi

సాక్షి న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న మహ్మమారి కరోనా అనతికాలంలోనే ప్రపంచదేశాలను ఆవహించింది. అయితే ముందస్తు జాగ్రత్తలతో పలు దేశాలు త్వరతగతిన అప్రమత్తత ప్రకటించడంతో కొంతమేర కట్టడిచేయగలిగాయి. ఇక చైనా, ఇటలీ, ఇరాన్ దేశాల్లో నాలుగో దశకు చేరుకుని.. ఆయా దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. వైరస్‌ ప్రభావం కాస్త ఆలస్యమైనప్పటికీ భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు దేశాలు మాత్రం ముందస్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రెండో దశ నుంచే కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది. అయితే రెండే దశలోనే వైరస్‌ పెద్ద ఎత్తన విజృంభిస్తుండటంతో భారత్‌లో త్వరలోనే మూడోదశకు చేరుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌లు సరిపోవు)

విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వైరస్‌ విస్తరింపజేసేది రెండో దశ. ప్రస్తుతం మనదేశంలో రెండోదశ కొనసాగుతుంది. ఈ దశను లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తుంటారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులు దిగగానే వారిని స్క్రీనింగ్‌ చేయ డం, లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్సలు చేయించడం, వ్యాధి లక్షణాలు లేకపోయినా వారిని ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించకుండా కట్టడి చేయవచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ కూడా మూడో దశ.. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ (సామాజిక వ్యాప్తి) పోరుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఓ జాతీయ పత్రిక తన ఎడిటోరియల్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. (పారాసిట్‌మాల్‌తో అద్భుత ఫలితం)

మూడో దశ ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తున వైరస్‌ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. కాగా చైనాతో పోలిస్తే భారత్‌లో జనసాంద్రత చాలా ఎక్కువ. మన దేశంలో ఒక చదరపు కిలోమీటర్‌ పరిధిలో 420 మంది నివశిస్తున్నారు. చైనాలో ఆసంఖ్య 148. అయితే భారత్‌లో రెండోదశ దాటి.. మూడోదశకు చేరితే వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో మురికివాడలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎజెన్సీ ప్రాంతాలూ ఎక్కువనే. దీంతో రెండోదశను దాటి మూడోదశకు చేరకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. (ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. కరోనాకు విరుగుడు..)

‘వైరస్‌ వ్యాప్తి మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, పడకలు ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవు. చిన్న వైరసే కదా అని నిర్లక్ష్యం చేస్తే జీవితమే కోల్పొవాల్సి వస్తుంది. ముందే మే ల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే.. వైరస్‌ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చని’ వైద్యలు చెబుతున్నారు.

నాలుగో దశ : వైరస్‌ నియంత్రణ చేయి దాటిపోయే దశ ఇదే. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్‌ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ.. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇరాన్, ఇటలీ వంటి దేశాలు మాత్రం ఇప్పటికీ వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కూడా విధిస్తున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top