ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. కరోనాకు విరుగుడు..!

HYDROXYCHLOROQUINE AZITHROMYCIN Medicine For Corona Says Trump - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)పై పోరాడేందుకు దేశాధినేతలు ఏకమవుతున్నారు. వైరస్‌కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నంలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం కాస్త ఊరటనిచ్చే వార్తను అందించింది. కరోనా వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయితో అమెరికా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న వ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి హైడ్రాక్సీక్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేసినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని, గొప్ప మలుపు సాధ్యమవుతుందని ట్విటర్‌ వేదికగా శుభ వార్తను అందించారు. (ఒక్కరోజే 793 మంది మృతి)

‘వైద్య చరిత్రలో అతిపెద్ద గేమ్ ఛేంజర్స్‌ అవతరణకు అవకాశం ఉంది. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్.. ఈ రెండింటి కలయికతో రూపొందే సరికొత్త ఔషధం సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం ఉంది. ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) దీనిపై పరిశోధన కొనసాగిస్తోంది. అజిత్రోమైసిన్ కంటే హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మంచి ఫలితాలను ఇస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ-మైక్రోబయాల్ ఏజెంట్స్ కూడా చెప్పారు. పరిశోధకులు ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. జనం చచ్చిపోతున్నారు, వేగంగా చేయండి. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. (ఇటలీ వీధుల్లో కరోనా విజృంభణ)

కాగా అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకూ 230 మంది వ్యాధి కారణంగా మరణించారు. మరోవైపు మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 11,737కు చేరుకుంది. ఇందులో 4వేలమంది ఇటలీ వారే కావడం గమనార్హం. వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 160 దేశాల్లో 2.75 లక్షలు దాటింది. ఇక ఇరాన్‌లో ఒక్క రోజు వ్యవధిలో 123 మంది కరోనాకు బలవడంతో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1556కు చేరుకుంది. ఇరాన్‌లో 20,610కి వైరస్‌ సోకిందని అక్కడి అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కరోనా వైరస్‌కు విరుగుడు వస్తుందని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top