భారతీయులు భళా: ట్రంప్‌

Donald Trump hails India is great scientists in race for COVID-19 - Sakshi

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పరిశోధనల్లో వారి కృషి అద్భుతం

ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలపై ట్రంప్‌ ప్రశంసలు

వాషింగ్టన్‌: భారత్‌ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి మందులు, వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వైట్‌హౌస్‌ రోజ్‌ గార్డెన్‌లో శుక్రవారం ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. ‘కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మందులు కనుక్కోవడంలో ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు చేస్తున్న కృషి మరువలేనిది’అని అన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ పరిశోధనకారులు, శాస్త్రవేత్తల్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఇదే తొలిసారి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వర్సిటీలు, రీసెర్చ్‌ వర్సిటీలు, బయో ఫార్మా స్టార్టప్‌లలో ఇండియన్‌ అమెరికన్‌ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై మందులు, వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్, అమెరికా సంయుక్త కృషితో ఈ ఏడాది చివరి నాటికి  వ్యాక్సిన్‌ కనుక్కుంటామని ట్రంప్‌ చెప్పారు.  

భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తామన్న ట్రంప్‌..స్నేహం బలపడిందన్న మోదీ
కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో ఎక్కువగా ఉపయోగపడే వెంటిలేటర్లను భారత్‌కు ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారు. భారత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని మరోసారి స్పష్టం చేశారు. ‘‘మా మిత్రదేశమైన భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తాం. భారత్‌కు అండగా ఉంటాం’అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రధాని మోదీ ట్వీట్‌ ద్వారా ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు. భారత్, అమెరికా మధ్య మైత్రికి మరింత బలోపేతంగా మారిందని అన్నారు. వైరస్‌ సోకిన తొలి రోజుల్లో అమెరికాకి క్లోరోక్విన్‌ మాత్రల్ని భారత్‌ భారీగా పంపడం తెల్సిందే.  కరోనాను ఎదుర్కోవడానికి కలసికట్టుగా కృషి చేయాలని, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ సమష్టిగా పోరుబాట పడితే ఆరోగ్యకరమైన ప్రపంచం ఆవిష్కృతమవుతుందని మోదీ పేర్కొన్నారు.  


శ్వేతసౌధంలోని రోజ్‌ గార్డెన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గర్ల్‌ స్కౌట్‌ ట్రూప్‌ 744 సభ్యురాలు శ్రావ్యా అన్నపరెడ్డిని సత్కరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top