అమెరికాలో నవంబర్‌ కల్లా కోవిడ్‌ టీకా

CDC Tells States How to Prepare for Covid-19 Vaccine by Early - Sakshi

వాషింగ్టన్‌: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని నవంబర్‌కల్లా ప్రజలకి అందుబాటులోకి తెస్తామని అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటిం చింది. వ్యాక్సిన్‌ పంపిణీకి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘అక్టోబర్‌ ఆఖరి వారం లేదంటే నవంబర్‌ మొదటి వారానికి కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమవుతుంది. దీని పంపిణీకి ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి’’అని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) అధికారులకు సూచించినట్టుగా న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనంలో వెల్లడించింది. సీడీఎస్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ ఫీల్డ్‌ రాష్ట్రాల గవర్నర్లకు ఆగస్టు 27నే ఒక లేఖ రాశారు.

మెక్‌కెసన్‌ కార్పొరేషన్‌ టీకా డోసుల్ని సరఫరా చేస్తుందని, రాష్ట్రాలు, వైద్య శాఖ, అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఆ సంస్థే వ్యాక్సిన్‌ సరఫరా చేసేలా సీడీసీతో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. అక్టోబర్‌ చివరి వారానికి టీకా డోసులు సిద్ధమవుతాయని, నవంబర్‌ ఒకటి నుంచి వాటి పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది లోపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ సిద్ధం కాదని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నప్పటికీ ట్రంప్‌ సర్కార్‌ మాత్రం అధ్యక్ష ఎన్నికలకి ముందే కరోనా వ్యాక్సిన్‌ తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. వ్యాక్సిన్‌ ద్వారా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు మెరుగుపడతాయని ట్రంప్‌ భావిస్తున్నారు

మూడో దశ ప్రయోగాలకు ముందే
అమెరికా పరిశోధనల్లో ఉన్న కరోనా వ్యాక్సిన్‌లు చాలా వరకు మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ ప్రయో గాలు పూర్తి కాకుండానే అత్యవసరమైతే వ్యాక్సిన్‌ను ఉపయోగించాలని కూడా ట్రంప్‌ సర్కార్‌ భావిస్తోంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తుది దశ ఆమోదానికి దగ్గరలో ఉందని ఇటీవల ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top