పొగ.. ముంచు 

Two Telugu States Covered By Fog - Sakshi

తెలంగాణ, ఏపీలో నాలుగు రోజులుగా తూర్పు గాలులు

మైదాన ప్రాంతాల్లోనూ పెరిగిన మంచు తీవ్రత

నీటి ఆవిరి ఉపరితలంపై ఉంటుండటం వల్లే...

వాహనదారులు ప్రమాదాల బారినపడే అవకాశం

ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

మరో 2, 3 రోజులు ఇదే పరిస్థితి: ఐఎండీ

సాక్షి,  హైదరాబాద్‌ /విశాఖపట్నం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పొగమంచు ముంచెత్తుతోంది. సూర్యాస్తమయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు దట్టంగా అలముకుంటోంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏజెన్సీ ప్రాంతాల్లోనే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ దాని తీవ్రత అధికమవుతోంది.

నాలుగు రోజుల నుంచి తూర్పు గాలులు వీయడం మొదలయ్యాయి. దీంతో ఉపరితలానికి కిలోమీటరు ఎత్తులో ఉష్ణోగ్రతలు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయి. దీనివల్ల నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ఉపరితలంపైనే ఉండిపోయి పొగమంచు ఏర్పడుతోంది. అదే సమయంలో బలమైన గాలులు కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని వాతావరణశాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని భారత వాతావరణ విభాగం ఆదివారం వెల్లడించింది. పొగమంచు వల్ల ప్రజలు జలుబు, తలనొప్పి, గొంతు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు పొగమంచు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

17 వరకు హైదరాబాద్‌లోనూ..

హైదరాబాద్‌లోనూ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నెల 17 వరకు రాత్రి వేళలతోపాటు ఉదయం 10 గంటల వరకు నగరంలో పొగమంచు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, హైదరాబాద్‌లో ఆదివారం 29.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవగా 17.5 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత  నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ అదనం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top