ఆటో పల్టీ: ఇద్దరి దుర్మరణం | two peoples are dead in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో పల్టీ: ఇద్దరి దుర్మరణం

Oct 5 2014 12:08 AM | Updated on Mar 28 2018 11:05 AM

ఆటో పల్టీ: ఇద్దరి దుర్మరణం - Sakshi

ఆటో పల్టీ: ఇద్దరి దుర్మరణం

వేగంగా వెళ్తున్న ఆటో బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి పల్టీలుకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో రైతు, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు.

ధారూరు: వేగంగా వెళ్తున్న ఆటో బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి పల్టీలుకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో రైతు, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ప్రమాదంలో మరో పదమూడు మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతగిరిగుట్ట మలుపులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వికారాబాద్ సీఐ రవి కథనం ప్రకారం.. వికారాబాద్ నుంచి ఓ ఆటో(ఏపీ 28 వై 1922) శనివారం ఉదయం ధారూరుకు ప్రయాణికులతో వెళ్తోంది.

ఈక్రమంలో అనంతగిరి గుట్ట దిగుతుండగా శివలింగం మలుపులో వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆటో వేగంగా ఉండడంతో లోయలోకి  దూసుకెళ్తుంది. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్ వెంకటయ్య వెంటనే కుడివైపుకు మళ్లించాడు. దీంతో ఆటో అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన రైతు కావలి ఎల్లయ్య(50) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధారూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్(45), శంషొద్దీన్(32), చాంద్‌పాషా(38), యాదయ్య(22), లక్ష్మణ్(20), మోసీన్(19)లకు తీవ్ర గాయాలయ్యా యి. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ఓ ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే మధుసూదన్ ప్రాణం విడిచాడు. శంషొద్దీన్, చాంద్‌పాషా, యాదయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వారిని నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రవి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా ఆటో డ్రైవర్ వెంకటయ్య పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఆస్పత్రి నుంచి వస్తూ..
ఆటో పల్టీలు కొట్టిన ప్రమాదంలో రైతు ఎల్లయ్య తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈయనకు భార్య బాల మణి, కొడుకు సాయిలు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఎల్లయ్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం వికారాబాద్‌లోని ఆ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగి మధుసూదన్ వికారాబాద్‌లోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. రెండునెలల క్రితం ఆయన ధారూరు తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈయనకు భార్య సరస్వతి, కూతురు విజయ ఉన్నారు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ మండలం మత్పల్ గ్రామస్తుడు. మధుసూధన్ రాజేంద్రనగర్ మండలం ఆరెమైసమ్మ వద్ద ఉంటూ ధారూరుకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement