
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 15 ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతం ఇతర అంశాల సహాకారం లేకుండా కూడా నిర్దిష్టమైన వృద్ధిని నమోదు చేసే ఆటో మోడ్‌లో ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO, నరెడ్‌కో) అధ్యక్షుడు మేకా విజయ సాయి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్‌కోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఆర్‌ఈడీఏ అని పిలిచేవారు.
నరెడ్‌కో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాపర్టీ షో వివరాలు తెలిపేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకా విజయ సాయి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 1,28,000 చదరపు కిలోమీటర్ల వరకూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి టారిఫ్‌లు, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి వంటివి ఒడిదుడుకులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఈ రంగం స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రీజనల్ రింగ్ రోడ్డు వంటివి ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి విషయంలో హైదరాబాద్, ముంబైను దాటిపోయిందన్నారు. హైదరాబాద్‌లో భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం ఇందుకు కారణమని తెలిపారు. గత ఏడాది జూలై సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమ్మకం ధరలు ఎనిమిది శాతం వరకూ పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల నాలుగు నుంచి 24 శాతం వరకూ ఉందన్నారు.ఐటీ అనిశ్చితి, ట్రంప్ విధానాలు ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ రంగానికి ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు.
అమ్మకాలపై నెగటివ్ ప్రచారం..
హైదరాబాద్‌లో లక్ష వరకూ రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని ఇటీవల వచ్చిన వార్తలను మేకా విజయ సాయి ఖండించారు. నగరంలో ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని కాదు? అన్నది తెలుసుకునేందుకు తగిన శాస్త్రీయ సమాచారం ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. ప్రభుత్వ సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడుపోవడం లేదన్న వార్తలు సృష్టించారని చెప్పారు. తమకున్న సమచారం మేరకు డెవలపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. నగరంలో అపార్ట్‌మెంట్ల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శకు ఆయన బదులిస్తూ.... 600 - 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన అపార్ట్‌మెంట్లు చాలా వరకూ అమ్ముడుపోవడం లేదని, దీన్నిబట్టి ప్రజలు మరింత విశాలమైన ఆపార్ట్‌మెంట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోందని అన్నారు.
ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్: కె.శ్రీధర్ రెడ్డి
నరెడ్‌కో 15వ ప్రాపర్టీ షో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుందని సంస్థ ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 74 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరితోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరు, సరఫరాదారులు ఐదుగురు, పర్యాటక రంగానికి చెందిన రెండు, భవన నిర్మాణ సామాగ్రీ, టెక్నాలజీలకు సంబంధించిన ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ యూనిట్ కొనుగోలుదారులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్‌లో ప్రత్యేక రాయితీ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నరెడ్‌కో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..