
'మెడ మీద తలకాయ ఉన్నోడెవరూ అలా చేయరు'
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఏపీలో ఒకే ఫార్మెట్‌లో 87 కేసులు నమోదు చేయడమంటే మెడకాయ మీద తలకాయి ఉన్నోళ్లు ఎవరూ అలా చేయరని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ సిటీ: తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఏపీలో ఒకే ఫార్మెట్‌లో 87 కేసులు నమోదు చేయడమంటే మెడకాయ మీద తలకాయి ఉన్నోళ్లు ఎవరూ అలా చేయరని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ఏపీ మంత్రులు మాట్లాడుతున్న మాటలు తెలుగుజాతిని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ అధినేతల పట్ల ఏపీ మంత్రులు చేస్తున్న పిచ్చికూతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్రబాబు తప్పుమీద తప్పు చేస్తున్నారన్నారు.
ఓటుకు నోటు కేసులో తప్పించుకునే దారిలేక రోజుకొక సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఫోన్ సంభాషణల్లో ఉన్నది తనగొందు కాదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్‌లో చెప్పినట్లు గంగిరెద్దులా తలూపుతున్న ఏపీ మంత్రులు..గవర్నర్‌ను దూషించడం సిగ్గుచేటన్నారు. ఇన్నాళ్లూ ఏపీ మంత్రులకు పరిపాలన కొనసాగించడం చేతకాదని భావించామని, అయితే వారి అవగాహన లేని అమాయకత్వపు మాటలను చూసి నవ్వుతెప్పిస్తోందన్నారు.