పురపోరుకు ‘కారు’ కసరత్తు జోరు | TRS Party Has Worked Hard To Win The Municipal Elections | Sakshi
Sakshi News home page

పురపోరుకు ‘కారు’ కసరత్తు జోరు

Jan 6 2020 4:00 AM | Updated on Jan 6 2020 5:12 AM

 TRS Party Has Worked Hard To Win The Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న పురపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి కసరత్తు ముమ్మరం చేసింది. రెండు నెలల క్రితమే పుర కసరత్తు ప్రారంభించిన అధికార టీఆర్‌ఎస్‌ పక్షాన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన రాష్ట్ర పార్టీ నేతలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన కేటీఆర్‌ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారు.  

ఇన్‌చార్జులుగా సీనియర్‌ నేతలు
పురపాలికల వారీగా పార్టీ పరిస్థితిని తెలుసుకుని వివరాలను సేకరించేందుకుగాను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలుగా నియమించింది. గత కొన్ని సంవత్సరాలుగా పారీ్టలో చేరిన కొత్త శ్రేణులు, టీఆర్‌ఎస్‌లో ముందు నుంచీ కొనసాగుతున్న సీనియర్‌ నేతల మధ్య సమన్వయంపైనే వీరు ప్రత్యేక దృష్టి సారించారు. వీరిని సమన్వయం చేసుకునే విషయంలో స్థానిక ఎమ్మెల్యేలే చొరవ చూపాలని, అందరినీ కలుపుకుని పోవాలన్న కేటీఆర్‌ సందేశం వారికి వినిపించి సంధి కుదిర్చే ప్రయత్నాలు చేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో పాత, కొత్త టీఆర్‌ఎస్‌ నేతల మధ్య సమన్వయం కుదిరినట్టే కనిపిస్తోంది. ఎన్నికల ప్రకటన వచి్చన నాటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా పార్టీ శ్రేణుల గొడవలు, లుకలుకలు బహిరంగంగా కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనమని గులాబీ నేతలు చెబుతున్నారు.  

కేసీఆర్‌ సమావేశం తర్వాత
ఐక్యతతోనే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ తన శ్రేణులకు మార్గదర్శనం చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ ఎన్నికలలో గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించారు. మున్సిపాలిటీల్లో ఓడిపోతే మంత్రుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్న కేసీఆర్‌ హెచ్చరికలతో అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కేసీఆర్‌ మీటింగ్‌కు ముందే ప్రతి మున్సిపాలిటీ నుంచి పార్టీ నివేదికలు తెప్పించుకుంది. ఈ నివేదికల మేరకు దాదాపు అన్ని చోట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనన్న సంకేతాలను కేసీఆర్‌ ఇవ్వడంతో ఇప్పుడంతా సమన్వయం, ఐక్యత అంశాలే ఫోకస్‌గా క్షేత్రస్థాయిలో గులాబీ దళం పనిచేస్తోంది.  

ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలు
మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పూర్వ మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్‌ నేతలు జిల్లాల వారీగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆహా్వనించారు. ఈ సమావేశాల్లో స్థానిక పరిస్థితులపై పార్టీ నేతల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న కేటీఆర్, మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరించారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం స్థానిక మీడియాను ఉపయోగించుకోవాలని చెప్పారు. పట్టణాల్లోని ప్రతి ఇంటికి పార్టీ ప్రచారం చేరాలని, ప్రతి ఓటర్‌ను నేరుగా కలిసేలా చూడాలని చెప్పారు.

వారి గురించి ఎక్కువ చెప్పొద్దు
ప్రచార వ్యూహాలపై కూడా టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్థానిక నాయకులకు పలు సూచనలు చేస్తోంది. ప్రతిపక్ష పారీ్టల నుంచి పోటీ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల గురించి అధికంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని కేడర్‌కు సూచిస్తోంది. గత ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనులు, పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి వివరించి ఓట్లడగాలని చెప్తోంది. ఇక, ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సేవలను కూడా ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఎన్నికల ప్రచార తీరు, కార్యాచరణను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటిప్పుడు మానిటర్‌ చేస్తామని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని, అలసత్వాన్ని సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్‌ పార్టీ నేతలకు తెలియజేయగా, ప్రతి మున్సిపాలిటీ సమాచారం కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఈ బాధ్యతలు పలువురు సీనియర్‌ నేతలకు అప్పగించనుంది. మొత్తంమీద కేటీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎప్పటిలాగే విజయతీరాలకు చేరేలా వ్యూహ రచన చేస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement