16 సీట్లు మనవే

TRS Confidence 16 Seats For In Parliamentary Elections - Sakshi

అభ్యర్థులు, మంత్రులకు కేసీఆర్‌ ఆదేశం

కౌంటింగ్‌ సరళిని అభ్యర్థులే పర్యవేక్షించాలి

మంత్రులు సమన్వయం చేయాలని సూచన

అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో సీఎం చర్చ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకుంటామని అధికార టీఆర్‌ఎస్‌ ధీమాగా ఉంది. వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌కు 14–16 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం హైదరాబాద్‌ మినహా అన్ని స్థానాల్లో గెలుపు తమదనే విశ్వాసంతో ఉంది. ప్రజలు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు అనుకూల తీర్పు ఇచ్చారని అధికార పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ను దీవించారనే అంచనాలో ఉంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో ఆశించిన ఆధిక్యత ఉండకపోయినా..అన్ని లోక్‌సభ స్థానాలు తమ ఖాతాలోకే పడతాయని ధీమాతో ఉంది. రెండు మూడు స్థానాల్లో మాత్రమే ఇతర పార్టీలోతో పోటీ ఉంటుందని.. మిగిలిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం ఖాయమని చెబుతోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్న నేపథ్యంలో.. లెక్కింపు ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలకు వివరించారు. పలువురు మంత్రులు, అభ్యర్థులతో కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీఆర్‌ఎస్‌ ఘన విజయం ఖాయమని, తుది ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లతో మంత్రులు సమన్వయం చేయాలని ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్ల నుంచి ఆఖరి ఈవీఎం వరకు లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏజెంట్లు ఓపికగా మొత్తం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని, ఈ మేరకు అభ్యర్థులు వారిని ఒప్పించాలని సూచించారు. ఎక్కువ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందని.. అయినా ఏ ఒక్కరూ అలసత్వంతో ఉండవద్దని సూచించారు. అధికారిక, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకున్న తర్వాతే లెక్కింపు కేంద్రాల నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలోని వారిని సంప్రదించాలని సూచించారు.

మంత్రుల సమన్వయం
గతంలో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ సెగ్మెంట్ల లెక్కింపు ప్రక్రియ ఒకేచోట జరిగేదని.. ఇప్పుడు ఒక్కో సెగ్మెంట్‌ ఒక్కో చోట ఉంటోందని మంత్రులు రెండు చోట్ల సమన్వయం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉంటూ మరో సెగ్మెంట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని బట్టి అవసరమైతే అక్కడికీ వెళ్లి రావాలని సూచించారు. ఏజెంట్లు అభ్యర్థులతో.. అభ్యర్థులు మంత్రులతో, మంత్రులు పార్టీ అధిష్టానంతో సమన్వయంతో ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులను అభినందించే సమయంలో పార్టీ ముఖ్యులంతా వెంటఉండేలా చూసుకోవాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top