కరెంట్‌ ఉద్యోగాలు వస్తున్నాయ్‌

Today Telangana Notification in Power Department - Sakshi

2,939 పోస్టుల భర్తీకి నేడు ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 2,939 పోస్టుల భర్తీకి శనివారం నియామక ప్రకటన విడుదల చేయనుంది. 2,438 జూనియర్‌ లైన్‌మెన్, 24 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్, 477 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. నియామక ప్రకటన పూర్తి వివరాలను అక్టోబర్‌ 10న  https://www.tssouthernpower.com లేదా https://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్లలో పొందపర్చనుంది. పోస్టుల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు గడువు, పరీక్ష తేదీ తదితర వివరాలు ప్రకటనలో వెల్లడించనున్నారు.

భారీసంఖ్యలో జూనియర్‌ లైన్‌మెన్, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు నియామకాలు చేపట్టుతుండటంతో నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చే అవకాశముంది. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి చేపట్టడం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. జూనియర్‌ లైన్‌మెన్, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను తెలంగాణ ట్రాన్స్‌కో ఇటీవలే పూర్తి చేసింది.

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నియామక ప్రకటనలో సైతం ఇవే రకమైన విద్యార్హతలు ఉండే అవకాశాలున్నాయి. ట్రాన్స్‌కో ప్రకటన ప్రకారం.. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు టెన్త్‌తో పాటు ఎలక్ట్రికల్‌/ వైర్‌మెన్‌ ట్రేడ్స్‌లో ఐటీఐ, ఎలక్ట్రికల్‌లో రెండేళ్ల ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు చేసి ఉండాలి. జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టుకు బీఏ, బీకాం, బీఎస్సీలో ఫస్ట్‌ క్లాస్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ కోర్సు లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top