చీకట్లో ‘తెలుగు వెలుగులు’ | Telugu velugulu at nights | Sakshi
Sakshi News home page

చీకట్లో ‘తెలుగు వెలుగులు’

Dec 9 2017 2:37 AM | Updated on Dec 9 2017 5:17 AM

Telugu velugulu at nights - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిరుచీకట్లు ముసురుకొనే వేళ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్యాంక్‌బండ్‌పై కొలువుదీరిన తెలుగు తేజాలను చూడాలనుకుంటున్నారా..? అయితే మీ ఆశలు అడియాసలే అవుతాయి. తెలుగు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన పలువురి ప్రముఖుల విగ్రహాలు నిశీధిలో మగ్గుతున్నాయి. సమాజాభివృద్ధి చోదకులుగా, సాహితీ దిగ్గజాలుగా వెలుగొందిన ఎందరో మహానుభావుల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై వెలుగుకు నోచుకోవడం లేదు. సాయంత్రం 6 దాటిందంటే చాలు ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులకు ఆ విగ్రహాలను వీక్షించడం అసాధ్యంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచతెలుగు మహాసభలను నిర్వహిస్తున్న వేళ విగ్రహాల పరిస్థితిపై కథనం.. 

చెట్ల కొమ్మలు కమ్మేశాయి.. 
ప్రథమాంధ్ర పాలకుడు శాలివాహనుడి నుంచి ఆదివాసీల పోరాటయోధుడు కుమురం భీమ్‌ వంటి వారి విగ్రహాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. చూడగానే వారి జ్ఞాపకాలు మదిలో కదలాడుతాయి. అలాంటి విగ్రహాల్లో చాలావరకు చెట్ల కొమ్మల మధ్య చీకట్లో మగ్గుతున్నాయి. విగ్రహాలు కనిపించేలా ఎలాంటి లైటింగ్‌ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చాలా మంది చెబుతున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న 33 విగ్రహాల్లో చాలా వరకు చీకట్లోనే ఉంటున్నాయి. కొన్ని విగ్రహాలు దుమ్ముకొట్టుకొని పోయాయి. కవిత్రయంలో చివరివాడు ఎర్రా ప్రగడ విగ్రహం వద్ద సిమెంట్‌ దిమ్మె దెబ్బతింది. గతంలో అన్ని విగ్రహాలు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలా ముఖంపై వెలుతురు పడేటట్లు లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలాంటి లైటింగ్‌ లేదు. 

వెలుగులు ప్రసరించేదెలా.. 
కాకతీయ మహా సామ్రాజ్యాన్ని ఏలిన రాణీ రుద్రమదేవి, ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్, త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య, తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడైన సర్‌ సీఆర్‌ రెడ్డి వంటి వారి నుంచి తిక్కన, నన్నయ, ఎర్రా ప్రగ డ, మొల్ల, రామదాసు, క్షేత్రయ్య, యోగి వేమన, సర్‌ ఆర్థర్‌ కాటన్, అబుల్‌ హాసన్‌ తానీషా వంటి ఎందరెందరో మహా నుభావుల విగ్రహాలు చీకట్లో అస్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ప్రపంచ మహాసభల వేళ.. 
ఈ నెల 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలు, పలు దేశాల నుంచి సుమారు 8 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా రానున్నారు. హైదరాబాద్‌ వచ్చిన ప్రతినిధులు, సందర్శకులు ట్యాంక్‌బండ్‌ను సందర్శించే అవకాశం ఉంది. సాయంకాల సమయంలో వారు వస్తే ‘చీకటి విగ్రహాలు’ మాత్రమే దర్శనమిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement