సాగరం..సరదా ప్రయాణం

telangana tourism new planning to sagar yatra - Sakshi

నేటి నుంచి సాగర్‌ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం

ప్యాకేజీలు ప్రకటించిన టూరిజం శాఖ

కనువిందు చేయనున్న కృష్ణమ్మ హయలు

మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణమ్మ.. ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలిసే వరకు.. తన ఒంపుసొంపులతో కనువిందు చేస్తోంది. ప్రధానంగా నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు ఉన్న నదీ పరీవాహకం.. పాపికొండలను మరిపిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని గుట్టలను చీల్చుకుంటూ.. సాగుతున్న నదికి.. ఇరువైపులా ఎత్తైన కొండలు, పెట్టని కోటల్లా ఉండే గండశిలలు, శిల్పాలు ప్రకృతి చెక్కి తీర్చిదిద్దిందా అన్నట్లు ఉన్నాయి. అంతటి అనుభూతిని నేటి నుంచి  టూరిజం శాఖ పర్యాటకుల దరికి చేర్చుతోంది.

నేటి నుంచి లాంచీ ట్రిప్‌
రెండు సంవత్సరాల అనంతరం సాగర్‌ నీటిమట్టం 575 అడుగులకు చేరడంతో.. టూరిజంశాఖ సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ నడుపుతోంది. బుధవారం ఉదయం 10 గంటలకు సాగర్‌లో లాంచీ ప్రయాణం ప్రారంభమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మధ్య నుంచి 110 కిలోమీటర్ల దూరం ఆరుగంటల పాటు కృష్ణమ్మను చీల్చుకుంటూ ఈ యాత్ర సాగనుంది.

యాత్ర ఇలా..
సాగర్‌నుంచి లాంచీలో బయలుదేరిన గంటకు  ఒకవైపు జింకలు, దుప్పులు, పెరుగుతున్న చాకలికొండ మరోవైపు బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండను చూస్తూ వెళ్తుంటాం. తర్వాత జలాశయం మధ్యలో అలనాడు వేలాది మంది శివభక్తుల పూజలందుకున్న  సింహపురి (ఏలేశ్వరం)గట్టు దర్శనమిస్తుంది. అక్కడి నుంచి ప్రకృతి అందాలను చూపుతూ యాత్ర సాయంత్రానికి లింగాల మల్లన్నగట్టు ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడినుంచి రోడ్డుమార్గంలో సాక్షి గణపతి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీశైలం దర్శిస్తారు. మరుసటి రోజు సాయంత్రం సాగర్‌కు 4 గంటలకు చేరుకుంటారు.

ప్రయాణ ప్యాకేజీ ఇలా..
హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వరకు వెళ్లే  పర్యాటకులకు పెద్దలకు 3,800, పిల్లలకు(5నుంచి 12సంవత్సరాల వరకు)రూ.2,400. దీనికి జీఎస్‌టీ అదనం. హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు బస్సులో తీసుకొచ్చి.. తీసుకెళ్తారు. సాగర్‌ నుంచి వెళ్లి తిరిగి లాంచీలో సాగర్‌ వచ్చే వారికి పెద్దలకు రూ.3,000, పిల్లలకు 1,500. పై రెండు ప్యాకేజీలకు శ్రీశైలంలో రాత్రి బస, భోజనం ఏర్పాటు చేస్తారు. శ్రీశైలంలో స్వామివారి దర్శనం, పాతాళగంగ తదితర ప్రాంతాలను పర్యాటకుల ఖర్చుతో చూపిస్తారు. సాగర్‌ నుంచి శ్రీశైలం మాత్రమే వెళ్లే వారికి (వన్‌వే) పెద్దలకు రూ.1,500,  పిల్లలకు రూ.1200. వీరికి లాంచీలో కేవలం మధ్యాహ్న భోజనం పెడతారు. లింగాల మల్లన్నగట్టు వద్ద వదిలేస్తారు.

వారంలో రెండు ట్రిప్పులు..
సాగర్‌ టు శ్రీశైలం వారంలో రెండు ట్రిప్పులు వేయనున్నట్లు లాంచీ మేనేజర్‌ సత్యం తెలిపారు. బుధ – గురువారం, శని–ఆదివారాల్లో లాంచీలు నడుపుతామన్నారు.
టికెట్‌ కోసం tstdc.in, telangana tourism.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 79979 51023 సెల్‌నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top