
5.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సాగర్‌కు నాలుగు లక్షల క్యూసెక్కులు
గోదావరి నదిలోనూ క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
నాగార్జునసాగర్/కన్నాయిగూడెం/ దోమలపెంట: కృష్ణా బేసిన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 5,03,100, సుంకేసుల నుంచి 71,136, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కులు మొత్తం 5,77,986 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఒక్కొక్కటి 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 4,61,560 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
అలాగే ఎడమ, కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 64,695 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,26,255 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.5 అడుగుల వద్ద 202.0439 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్ 26 గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా 3,76,402 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో మరో 33,373 క్యూసెక్కులు వదులుతున్నారు.
సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 587.30 అడుగులు (305.6838 టీఎంసీలు) ఉంది. భారీ వర్షాల వల్ల ఆయకట్టు పొలాలకు నీటి అవసరాలు తగ్గడం, కాల్వల కరకట్టలు జారిపోయే ప్రమాదం ఉండటంతో సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లే కుడి కాల్వకు మాత్రం 8,023 క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాలతో గోదావరిలో నీటిమట్టం కూడా వేగంగా పెరుగుతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తు పాకులగూడెం గ్రామంలోని సమ్మక్కసాగర్ బరాజ్‌కు 6,72,140 క్యూసెక్కుల వరద వస్తోంది. బరాజ్ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.