ఆట మొదలైంది! | Sakshi
Sakshi News home page

ఆట మొదలైంది!

Published Sat, Oct 21 2017 7:43 PM

telangana TDP main leaders Joining in trs party - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు ప్రాంతంలోని రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంతో టీడీపీ నేతలు తలోదిక్కు వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్‌ ఒక వైపు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. ఆయన సొంత నియోజకవర్గంలోని ముఖ్యనేతలు మాత్రం గులాబీ పార్టీకి జైకొట్టారు. టీఆర్‌ఎస్‌ వేసిన స్కెచ్‌లో భాగంగా రేవంత్‌ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాల్‌సింగ్‌ నాయక్‌ తిరుగుబావుట ఎగురేశాడు. మరోవైపు పార్టీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి పరోక్షంగా రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. తమ పార్టీలోంచి ఎవరైనా నాయకులు ఇతర పార్టీలోకి వెళ్తే కేవలం అధికారం కోసమేనని, ప్రజల కోసం కాదని విరుచుకుపడ్డారు. ఇలా టీడీపీకి చెందిన ముఖ్య నేతల చర్యలతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.

ఏం చేద్దాం..
మరోవైపు ఉమ్మడి జిల్లాలోని టీడీపీకి చెందిన రెండో స్థాయి నాయకులందరూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు వెళ్లిపోతుండడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఇతర ముఖ్యనేతలు కూడా రేవంత్‌ వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా చూసేందుకు ఓ వైపు టీడీపీ, మరో వైపు టీఆర్‌ఎస్‌ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అదే విధంగా రేవంత్‌ కూడా తన సొంత జిల్లా కావడంతో పాలమూరు ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరికి వారు అనుసరిస్తున్న వైఖరులతో పాలమూరు రాజకీయాలు వేడెక్కినట్లయింది.

టీడీపీలో లుకలుకలు
టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా నాయకులు ఆగమేఘాల మీద సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్‌ వెంట ఎవరూ వెళ్లకుండా చూడాలని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా నేతలు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా అన్ని మండలాల నుంచి కీలక నేతలను జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు శుక్రవారం రప్పించారు. ఈ సమావేశానికి రేవంత్‌తో సహా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన జిల్లాలోని కోస్గి, మద్దూరు నేతలు గైర్హాజరయ్యారు.

నియోజకవర్గంలోని నేతలందరూ రేవంత్‌ వెంటే ఉన్నట్లు పార్టీ నేతలు భావించారు. ఈ సందర్భంగా రేవంత్‌ను ఉద్దేశించి పార్టీ సీనియర్‌ నేత దయాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమను పార్టీ నుంచి ఎంత దమ్మున్న నేత అయినా తీసుకువెళ్లలేరని స్పష్టం చేశారు. పార్టీ జాతీయ నాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాటే తమకు వేదమని.. మరెవరు తమను నిర్దేశించలేరంటూ వ్యాఖ్యానించారు.  

రంగంలోకి టీఆర్‌ఎస్‌ నాయకులు
టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను అనునిత్యం పదునైన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్‌రెడ్డిని దెబ్బతీసేందుకు ప్రస్తుత సంక్షోభంలోకి గులాబీ నేతలు రంగ ప్రవేశం చేశారు. రేవంత్‌ పార్టీ మారేలోగా ఆయన నియోజకవర్గంలోని కీలక నేతలను ఒక్కొక్కరిగా లాగేసేందుకు ప్రణాళికను రచించారు. ఇలా కొడంగల్‌ నియోజకవర్గంలో బలమైన నేతలకు గులాబీ వల విసురుతోంది. అందుకు అనుగుణంగా శుక్రవారం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. మద్దూరు మండలంలో టీడీపీ బలమైన నేతగా.. రేవంత్‌ ప్రధాన అనుచరుడిగా పేరొందిన బాల్‌సింగ్‌ నాయక్‌ తిరుగుబావుటా ఎగురేశాడు. మండలంలోని ముఖ్యనేతలందరినీ మహబూబ్‌నగర్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఈ సమావేశంలో ఎన్నడు లేని విధంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం.

ఇంతలోనే రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి(నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది ఇతనే) రంగప్రవేశం చేశారు. తిరుపతిరెడ్డిని చూసిన వెంటనే బాల్‌సింగ్‌ కోపోద్రిక్తుడై ఆవేశంగా అతని మీదకు దూసుకెళ్లాడు. అంతేకాదు ‘నా అనుమతి లేకుండా నా ఇంటికి ఎవడు రమ్మన్నాడు’ అంటూ తిరుపతిరెడ్డిపై విరుచుకుపడ్డారు. వెంటనే పార్టీ నేతలు ఇరువురిని సముదాయించారు. అనంతరం పార్టీ రెండు వర్గాలు చీలి కొందరు బాల్‌సింగ్‌తో కలిసి టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు.

 ఈ మేరకు బాల్‌సింగ్‌తో పాటు ఎంపీపీ భర్త శివకుమార్, టీడీపీ మండల అద్యక్షుడు వీరారెడ్డి, వైస్‌ ఎంపీపీ సాయప్ప, ఎంపీటీసీలు వీరేష్, వెంకటయ్యతో పాటు కొమ్మురు, చింతల్‌దిన్నే తదితర గ్రామాల సర్పంచ్‌లు హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షాన గులాబీ కండువా కప్పుకున్నారు. అదే విధంగా రేవంత్‌కు అండగా నిలిచిన కోస్గిపై టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించారు.

ఒకటి, రెండు రోజుల్లో మద్దూరు మాదిరిగానే కోస్గి నేతలు తిరుగుబాటు ఎగువేయనున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి జిల్లాలో రేవంత్‌ అనుకూల వర్గంగా పేరొందిన టీడీపీ నేతలను ఆయన వెంట వెళ్లకుండా చూసేందుకు ఓవైపు టీడీపీ, మరో వైపు టీఆర్‌ఎస్‌ శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.

Advertisement
Advertisement