లెక్కల్లో నేతలు!

Telangana Lok Sabha Congress Candidates Waiting For Results - Sakshi

హోరాహోరీగా కొనసాగిన లోక్‌సభ ఎన్నికల పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? పక్షం రోజుల నుంచి విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల్లో అంతిమంగా ఓటరు ఎవరి వైపు మొగ్గుచూపాడు?  ప్రతిష్టాత్మకంగా మారిన పాలమూరు సీటుపై పాగా వేసేదెవరు? ఇప్పటి వరకు గెలుచుకోని నాగర్‌కర్నూల్‌ సీటు ఈ సారైనా గులాబీ పరమవుతుందా? సర్వత్రా ఇప్పుడిదే చర్చ. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌  ముగిసిన వెంటనే ఫలితాలపై మొదలైన విశ్లేషణలు ప్రధాన పార్టీలనే కాదు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి.  బూత్‌ వారీగా పోలైన ఓట్లపై లెక్కలేసుకుంటున్న వైనం పాలమూరులో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ నాగర్‌కర్నూల్‌లో దూసుకెళ్లిన ‘కారు’ తగ్గిన పోలింగ్‌ శాతంపై అన్ని పార్టీల్లో ఆందోళన ఎవరు గెలిచినా మెజార్టీ అంతంతే 41 రోజుల వరకు ఇదే ఉత్కంఠ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా, ఏ నాలుగురు కలిసినా లోక్‌సభ ఎన్నికల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. పార్టీల వారీగా ఎవరికి వారే తమ పార్టీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తమ పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి పోలింగ్‌ సరళి పరిశీలించిన అభ్యర్థులు.. పోలింగ్‌ తర్వాత తమ అనుచరులతో ప్రజల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూనే.. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్ల వివరాలు సేకరించుకున్న అభ్యర్థులు గెలుపోటములపై లెక్క లేసుకుంటున్నారు.

పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడంతో.. ఎన్నికల ఫలితాలకు ఇంకా  41 రోజులు మిగిలి ఉండడంతో అప్పటి వరకు ఎదురుచూసే పరిస్థితి రావడం అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్‌శాతం తగ్గడంతో ప్రచార పర్వంలో ప్రజల ఆదరణను చూసి తాము లెక్కలేసుకున్న మెజార్టీపై అభ్యర్థులు ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు, నాగర్‌కర్నూల్‌ అభ్యర్ధి పోతుగంటి రాములు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అంత మెజార్టీ రావడం అనుమానమే అని గులాబీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

గెలుపు ధీమాలో గులాబీ శ్రేణులు.. 
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన వారే అత్యధిక సర్పంచ్‌ స్థానాలు గెలుపొంది గులాబీ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా అవతరించింది. ఇదే స్ఫూర్తితో ఆయా పార్టీ శ్రేణులందరూ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో విస్తృత ప్రచారం చేశారు.

మరోవైపు ఉమ్మడి జిల్లాలో ‘కారు..సారు..పదహారు..సర్కారు’ అనే నినాదంతో దూసుకెళ్లిన టీఆర్‌ఎస్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ ఫథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవే తమకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్న ఆ పార్టీ పోలింగ్‌ తగ్గినా ఫర్వాలేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు తమతమ అనుచరులతో సర్వేలు నిర్వహిస్తున్నారు.

కమల విలాపమా? వికాసమా? 
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రెండు లోక్‌సభ స్థానాలూ తమవే అంటోన్న కాషాయ శ్రేణులు పట్టణాలతో పాటు గ్రామీణ ఓటర్లూ ఈసారి తమను ఆదరించారనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్‌ శాతం తగ్గడం.. టీఆర్‌ఎస్‌కు ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్ల వివరాలు సేకరించుకుని లెక్కలేసుకుంటున్నారు.

పాలమూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ విషయానికి వస్తే.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చారు. బీజేపీ ఓటు బ్యాంకు ఉన్న నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్‌లతో పాటు జడ్చర్లలోనూ ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పార్లమెంట్‌ పరిధిలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటి కంటే షాద్‌నగర్‌ సెగ్మెంట్‌లోనే అత్యధికంగా 70శాతం పోలింగ్‌ జరగడం, బీజేపీ తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. ఇటు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంకు ఉన్న కల్వకుర్తి, వనపర్తిలో పోలైన ఓట్లపై ఆ పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు

కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా..? 
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో గె లుపు కాంగ్రెస్‌ పార్టీకి సవాలుగా మారింది. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన జైపాల్‌రెడ్డి సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి 2,590 స్వ ల్ప ఓట్లతో ఓడిపోయారు. కాగా నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నందిఎల్లయ్య గెలుపొందారు. అ యితే గతంలో పోటీ చేసిన ఇద్దరూ ఈసారి పోటీకి దూరంగా ఉండడంతో పార్టీ అధిష్టానం స్థానికేతరులైన వంశీచంద్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌ నుంచి, మల్లురవిని నాగర్‌కర్నూల్‌ నుంచి బరిలో దింపింది.

వీరిద్దరూ విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లపైనే భరోసాతో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల వైపే ప్రజలు మొగ్గుచూపుతారని భావించిన పార్టీ శ్రేణులు రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ మైనార్టీ ఓట్లన్నీ తమకే  పోలయ్యాయనే ధీమాతో ఉన్నారు. మహబూబ్‌నగర్‌ పరిధిలో 2.40లక్షలు, నాగర్‌కర్నూల్‌లో 1.90లక్షల ఓట్లు ఉండగా వాటిలో సింహభాగం ఓటర్లు హస్తం వైపు మొగ్గుచూపారనే ఆశతో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top