కాలేజీ విద్యార్థులకు వరం

Telangana Govt To Roll Out Mid Day Meal Scheme Adilabad - Sakshi

బోథ్‌ (ఆదిలాబాద్‌): ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్, మోడల్‌ స్కూళ్లలో అమలు చేయాలని భావిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న దాదాపు పది వేల మంది విద్యార్థుల ఆకలి తీరనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాçహ్న భోజనం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించడంతో ఈ నెల 28న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డిలు సమావేశమై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పథకం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. భోజనం పథకం అమలును అక్షయపాత్ర సంస్థకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమలుకు  ప్రతిపాదనలు..
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన భోజన పథకం అమలు కోసం ప్రభుత్వం మూడు రకాల ప్రతిపాదనలు తయారు చేస్తోంది. విద్యార్థులకు కావాల్సిన సరుకులను ప్రభుత్వమే అందజేయడం, లేక అక్షయ ఫౌండేషన్‌కు అందించడం, లేదా పులిహోరా, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు వంటి తృణ ధ్యాన్యాలతో కలిపి విద్యార్థులకు అందించడం వంటి  ప్రతిపాదనలను తయారు చేస్తోంది. కాగా మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టులో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 
జిల్లాలో పదివేల మంది విద్యార్థులు.. 
ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ జూనియర్, మూడు ప్రభుత్వ డిగ్రీ, ఒకటి ప్రభుత్వ బీఈడీ, ఒకటి ప్రభుత్వ డీఈడీ, ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆరు మోడల్‌   స్కూళ్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 10,194 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనానికి రూ.5 కోట్ల వరకు సంవత్సరానికి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్షయ ఫౌండేషన్‌ సంస్థ ద్వారా భోజన కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

హాజరు పెరిగే అవకాశం..
ప్రభుత్వ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టనుండడంతో ఆయా కళాశాలలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఆకలి బాధలు తీరనున్నాయి. చాలా కళాశాలలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయం పూట తినకుండానే వస్తున్నారు. మధ్యాహ్నం సైతం తినకుండా క్యాంటీన్లలో స్నాక్స్, బిస్కట్‌ వంటివి తింటూ ఆకలి తీర్చుకుంటున్నారు. దీంతో అలసిపోయి క్లాసులు వినలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరికొందరు కళాశాలలకు రావడమే మానేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు వరంలా మారనుంది. దీంతో కళాశాలకు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. 

మధ్యాహ్నం ఇంటికి  వెళ్తున్నాం..
పదవ తరగతి వరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఉండడం వల్ల అక్కడే తినేవాళ్లం. ఇంటర్మీడియట్‌లో చేరిన తరువాత మధ్యాహ్న భోజనం లేకుండా పోయింది. మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం ఉన్న క్లాసులకు ఆలస్యం అవుతోంది. అలసినట్లు అవుతోంది.


– ఏ.రఘు, ఇంటర్‌ విద్యార్థి, బోథ్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top