అతివలకే అందలం: సీఎం రేవంత్‌ | CM Revanth says We are giving utmost priority to women in govt administration | Sakshi
Sakshi News home page

అతివలకే అందలం: సీఎం రేవంత్‌

Mar 9 2026 4:37 AM | Updated on Mar 9 2026 4:37 AM

CM Revanth says We are giving utmost priority to women in govt administration

ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం: సీఎం రేవంత్‌

కలెక్టర్లు, ఎస్పీలుగా అవకాశం ఉన్న చోట మహిళలను నియమిస్తున్నాం 

మూసీ ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారు 

బఫర్‌జోన్‌లో కట్టడాలకు ప్రత్యామ్నాయం చూపుతుంటే గగ్గోలు పెడుతున్నారు 

ఈ నెల 13న మూసీ రివర్‌ఫ్రంట్‌పైన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తాం 

గాంధీ విజ్ఞాన కేంద్రానికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? 

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలో మంచి వార్త చెబుతాను 

ప్రజా భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్‌ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్‌హెచ్‌జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్‌తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్‌ టాలెంట్‌ను గ్లోబల్‌ టాలెంట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.  

కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... 
‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

మూసీ రివర్‌ఫ్రంట్‌కు అడ్డుపడుతున్నారు.. 
2047 నాటికి ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్‌ ఫ్రంట్, యూపీలో గంగా రివర్‌ ఫ్రంట్‌ నిర్మించిన వారు హైదరాబాద్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్‌ జోన్‌లో అపార్ట్‌మెంట్‌ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్‌ జోన్‌ ఉంది. అందుకే ఆ అపార్ట్‌మెంట్‌ నివాసితులను పిలిచి మాట్లాడాం. 

వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్‌మెంట్‌ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్‌ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్‌జోన్‌లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్‌ జోన్‌లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్‌ ఫ్రంట్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు.
 
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త 
‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్‌ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్‌ చేస్తాం’అని సీఎం వివరించారు. 

మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి 
మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్‌ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement