
ఫీర్జాదిగూడలోని అన్నపూర్ణ కేంద్రం వద్ద కార్మికులు
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్ తో రాష్ట్రంలోని పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తాళం పడింది. చేసేందుకు చేతినిండా పనీ..తినేందుకు జేబునిండా డబ్బులేకపోవటంతో కాయకష్టం చేసుకుని పొట్ట నింపుకునే కూలీలకు ముద్ద కరువైంది. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం..దేశంలో ఎక్కడా లేనివిధంగా వలసజీవులు, యాచకులకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇల్లు లేకుండా వీధుల్లోనే జీవనం సాగిస్తున్న వలస కూలీలకు రెండు పూటలా నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డిస్తోంది.
రాష్ట్రంలోని 11 నగరపాలక సంస్థల పరిధిలో ప్రతిరోజూ 26,526 మందికి లంచ్, రాత్రి డిన్నర్‌ను (కరీంనగర్, వరంగల్ మినహా)ఉచితంగా పంపిణీ చేస్తుంది.హైదరాబాద్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగతా వాటిలో వండి వారుస్తోంది. రామగుండంలో వలస జీవుల సంఖ్య తక్కువగా ఉంది. ఇక జంటనగరాల్లో అన్నపూర్ణ కేంద్రాల్లో రూ.5లకే ఇచ్చే భోజనాన్ని ఉచితంగా అందించడంతోపాటుగా వలస కూలీల ఆకలిని ప్రభుత్వం తీరుస్తోంది. వలస జీవులు, యాచకులు ఇతర నిరాశ్రయులకు భోజనవసతి కల్పించేందుకు ముందుకొచ్చేవారి సహకారం తీసుకుంటోంది.