సింగరేణిపైనే సర్కార్ ఆశలు | Telangana government to hope on Singareni industry | Sakshi
Sakshi News home page

సింగరేణిపైనే సర్కార్ ఆశలు

Dec 8 2014 1:00 AM | Updated on Sep 18 2018 8:28 PM

విద్యుత్ సంక్షోభం అంచుల్లో ఉన్న రాష్ట్రాన్ని.. సింగరేణి సంస్థ కొంత వరకూ ఆదుకోనుంది.

ఆ సంస్థ ఏర్పాటు చేయబోయే థర్మల్ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఆశలు
తెలంగాణకు అందుబాటులోకి ఏటా 3,855 మిలియన్ యూనిట్లు

 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం అంచుల్లో ఉన్న రాష్ట్రాన్ని.. సింగరేణి సంస్థ కొంత వరకూ ఆదుకోనుంది. ఆ సంస్థ చేపట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు రాష్ట్రానికి ఊరటగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని నుంచి 2016 చివరినాటికి 3,855 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ వద్ద సింగరేణి రెండు 600 మెగావాట్ల యూనిట్లను నిర్మిస్తోంది.
 
  మొదటి యూనిట్‌ను 2015 ఫిబ్రవరిలో, రెండో యూనిట్‌ను జూన్‌లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. పనులు పూర్తికాకపోవటంతో 2016 మార్చిలో మొదటి యూనిట్, 2016 అక్టోబర్‌లో రెండో యూనిట్ అందుబాటులోకి వస్తాయని సింగరేణి అంచనా వేస్తోంది. ఈ మొత్తం 1,200 మెగావాట్లలో 150 మెగావాట్లను తమ సొంత అవసరాలకు వాడుకొని.. మిగతా 1,050 యూనిట్ల విద్యుత్‌ను అమ్ముకోవాలనే ఉద్దేశంతో సింగరేణి ఈ ప్రాజెక్టులను చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నాలుగు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు, పంపిణీ ఒప్పందాలున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇందులో 53.89 శాతం వాటా తెలంగాణకు దక్కుతుంది. అంటే 3,855 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని డిస్కం అంచనా.
 
 పనుల్లో జాప్యం..: రూ. 5,700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రం పను లు ఆలస్యమవడంతో... అంచనా వ్యయం ఇప్పటికే రూ. 8,000 కోట్లకు చేరింది. దీనికితోడు బొగ్గు బావుల నుంచి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా చేసే 17 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మా ణం ఇప్పటికీ టెండర్ల దశలోనే ఉంది. దీనికోసం నిధులు కేటాయించినా.. అనుమతులు రాలేదు. ఇక గోదావరి నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ కేంద్రం నిర్మాణం మరింత ఆలస్యం కానున్నాయి. కానీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం దృష్ట్యా పనులు వేగవంతం చేసినట్లు సింగరేణి వర్గాలు వెల్లడించాయి.
 
 బొగ్గు సరఫరా పెరిగేనా?: మరోవైపు కొత్త విద్యుత్ కేంద్రాలకు సరిపడే బొగ్గు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎన్టీపీసీతో పాటు తెలంగాణ, ఏపీ జెన్‌కోల సారథ్యంలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఏటా 8.40 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. వీటికి సింగరేణి నుంచి ఏటా దాదాపు 13 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయగలుగుతోంది. 2012-13లో 11.55 మిలియన్ టన్నులు, గత ఏడాది 13.26 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేశారు. అవసరంతో పోలిస్తే బొగ్గు సరఫరా ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెరగలేదు. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్‌కు ఏటా 1.80 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి అందిస్తోంది. పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ మేరకు రాష్ట్రంలో మరో 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో మొదటి విడతగా 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నిర్మాణానికి.. రామగుండంలో సన్నాహాలు మొదలయ్యాయి. వీటికీ సింగరేణి బొగ్గు సరఫరా చేయాలి.  సింగరేణి మొత్తంగా ఏటా 50 మిలియన్ టన్నుల వరకు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నా... ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ సంస్థలకు 77 శాతం బొగ్గును సరఫరా చేస్తోంది. పైగా ఇతర పరిశ్రమలకు కూడా బొగ్గు సరఫరాకు ఒప్పందాలున్నాయి. ఈ తరుణంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచితే తప్ప కొత్త విద్యుత్ కేంద్రాలకు సరిపడేంత అందించడం సాధ్యం కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement