భూ పంపిణీ పథకం

Telangana Government Land Distributions Stop - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): సాగు భూముల్లేని నిరుపేద ఎస్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడెకరాల భూ పంపణీ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. నాలుగు సంవత్సరాల పాటు సక్రమంగా జరిగిన భూ పంపిణీ తహసీల్దార్ల జాప్యం కారణంగా గత రెండేళ్లుగా నిలిచి పోయింది. గత రెండు సంవత్సరాల్లో ఒక్క లబ్ధిదారుడికి కూడా భూ పంపిణీ జరగలేదు. తమకు సాగుభూమి అందజేయాలని చాలా మంది ఎస్సీలు మండల కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. వారిలో అర్హులను గుర్తించి జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయానికి జాబితా పంపడంలో ఆయా మండలాల తహసీల్దార్లు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ఏడాదిన్నర కాలంగా జిల్లాలో ఒక్క కుటుంబానికి కూడా సాగు భూమి అందలేదు. జిల్లాలో 2014–15 నుంచి 2017–18 వరకు నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం 174 మంది లబ్ధిదారులకు 408 ఎకరాల భూమిని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు పొందారు. అయితే, 2017–18 సంవత్సరం వరకే జిల్లాలో భూ పంపిణీ జరగ్గా, 2018–19 సంవత్సరంలో అసలు భూ పంపిణే జరగలేదు. ఇక ప్రస్తుతం నడుస్తున్న 2019–20 సంవత్సరానికి కసరత్తు కూడా మొదలు కాలేదు.

గతేడాది గుర్తింపునకే పరిమితం.. 
2018–19 సంవత్సరానికి ఎస్సీలకు భూ పంపిణీ చేయడానికి తహసీల్దార్లు, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కలిసి ఆయా మండలాల్లో పట్టా భూములను కొనుగోలు చేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌ డివిజన్లలో మొత్తం 38 ఎకరాలు గుర్తించారు. వరుస ఎన్నికలు రావడంతో భూముల కొనుగోలు అంతటా జరగలేదు. ఇంతలో విక్రయించడానికి వచ్చి వారిలో కొంత మంది తాము భూమిని అమ్మబోమని చెప్పడంతో పది ఎకరాలు మైనస్‌ అయ్యాయి. దీనికి తోడుగా మండలాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జరగక పోవడంతో కూడా భూ పంపణీ మరింత ఆలస్యంగా మారింది. లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది.

బోర్‌ డ్రిల్‌కు రిజిస్ట్రేషన్‌ సమస్య.. 
నిరుపేద ఎస్సీలకు భూ పంపిణీ చేసిన అనంతరం ఆ భూమిని సాగు చేసుకోవడానికి ఉచిత విద్యుత్‌ కనెక్షన్, బోరు డ్రిల్‌ చేసి మోటారు బిగించి ఇవ్వాలి. కానీ 2017–18 సంవత్సరంలో 19 మందికి పంపిణీ చేసి 27.06 ఎకరాల భూమిలో ఈ పనులు జరగలేదు. లబ్ధిదారుల పేరుతో ధరణి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ కాకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. దీంతో విద్యుత్‌ కనెక్షన్, బోర్‌ డ్రిల్, మోటారు బిగింపు పనులు చేపట్టేందుకు వీలు కావడం లేదు. 2016–17 సంవత్సరానికి చెందిన కొందరు లబ్ధిదారుల సాగు భూముల్లో కూడా ధరణి సమస్యతోనే బోర్‌ డ్రిల్‌ చేయడానికి వీలు కాలేదు. ధరణిలో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు పలుమార్లు రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
 
భూములు కొనలేని పరిస్థితి.. 
ఎస్సీలకు భూ పంపిణీ పథకం ద్వారా సాగు భూములు అందజేయాలంటే ముందుగా అధికారులు ఇతరుల నుంచి పట్టా భూములను కొనుగోలు చేయాలి. విక్రయదారులు కూడా ప్రభుత్వానికి భూములను విక్రయించడానికి సమ్మతంగా ఉంటేనే సంబంధిత తహసీల్దారు, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కలసి భూమిని పరిశీలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కొనేందుకు ఒక ఎకరానికి రూ.7లక్షల వరకు మాత్రమే అందజేస్తోంది. జిల్లాలో సాగు భూముల ధరలు పెరిగి పోయాయి. ఎకరానికి రూ.10 లక్షల పైనే పలుకుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న ధర, జిల్లాలోని భూముల ధరలకు రూ.3–4 లక్షల తేడా ఉంది. దీంతో భూములను కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే అత్యవసర పరిస్థితి ఉన్న వారు, ఆర్థిక పరిస్థితులు బాగోలేని వారు మాత్రమే ప్రభుత్వ ధరకు భూములను విక్రయిస్తున్నారు.

కసరత్తు జరుగుతోంది.. 
2017–18 వరకు ఎస్సీలకు భూ పంపిణీ జరిగింది. ధరణిలో రిజిస్ట్రేషన్‌ కారణంగా ఉచితంగా బోర్‌ డ్రిల్, విద్యుత్‌ కనెక్షన్, మోటారు బిగింపు ఆలస్యం అవుతోంది. అలాగే 2018–19 సంవత్సరానికి 38 ఎకరాల వరకు భూమిని గుర్తించాం. మండలాల నుంచి తహసీల్దార్లు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భూ పంపిణీ చేపడుతాం. 2019–20 సంవత్సరానికి కూడా కసరత్తు చేస్తాం. – బి.శశికళ, ఈడీ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top