breaking news
Land Distribution of program
-
భూ పంపిణీ పథకం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): సాగు భూముల్లేని నిరుపేద ఎస్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడెకరాల భూ పంపణీ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. నాలుగు సంవత్సరాల పాటు సక్రమంగా జరిగిన భూ పంపిణీ తహసీల్దార్ల జాప్యం కారణంగా గత రెండేళ్లుగా నిలిచి పోయింది. గత రెండు సంవత్సరాల్లో ఒక్క లబ్ధిదారుడికి కూడా భూ పంపిణీ జరగలేదు. తమకు సాగుభూమి అందజేయాలని చాలా మంది ఎస్సీలు మండల కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. వారిలో అర్హులను గుర్తించి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి జాబితా పంపడంలో ఆయా మండలాల తహసీల్దార్లు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ఏడాదిన్నర కాలంగా జిల్లాలో ఒక్క కుటుంబానికి కూడా సాగు భూమి అందలేదు. జిల్లాలో 2014–15 నుంచి 2017–18 వరకు నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం 174 మంది లబ్ధిదారులకు 408 ఎకరాల భూమిని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు పొందారు. అయితే, 2017–18 సంవత్సరం వరకే జిల్లాలో భూ పంపిణీ జరగ్గా, 2018–19 సంవత్సరంలో అసలు భూ పంపిణే జరగలేదు. ఇక ప్రస్తుతం నడుస్తున్న 2019–20 సంవత్సరానికి కసరత్తు కూడా మొదలు కాలేదు. గతేడాది గుర్తింపునకే పరిమితం.. 2018–19 సంవత్సరానికి ఎస్సీలకు భూ పంపిణీ చేయడానికి తహసీల్దార్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కలిసి ఆయా మండలాల్లో పట్టా భూములను కొనుగోలు చేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో మొత్తం 38 ఎకరాలు గుర్తించారు. వరుస ఎన్నికలు రావడంతో భూముల కొనుగోలు అంతటా జరగలేదు. ఇంతలో విక్రయించడానికి వచ్చి వారిలో కొంత మంది తాము భూమిని అమ్మబోమని చెప్పడంతో పది ఎకరాలు మైనస్ అయ్యాయి. దీనికి తోడుగా మండలాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జరగక పోవడంతో కూడా భూ పంపణీ మరింత ఆలస్యంగా మారింది. లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. బోర్ డ్రిల్‌కు రిజిస్ట్రేషన్ సమస్య.. నిరుపేద ఎస్సీలకు భూ పంపిణీ చేసిన అనంతరం ఆ భూమిని సాగు చేసుకోవడానికి ఉచిత విద్యుత్ కనెక్షన్, బోరు డ్రిల్ చేసి మోటారు బిగించి ఇవ్వాలి. కానీ 2017–18 సంవత్సరంలో 19 మందికి పంపిణీ చేసి 27.06 ఎకరాల భూమిలో ఈ పనులు జరగలేదు. లబ్ధిదారుల పేరుతో ధరణి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కాకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు. దీంతో విద్యుత్ కనెక్షన్, బోర్ డ్రిల్, మోటారు బిగింపు పనులు చేపట్టేందుకు వీలు కావడం లేదు. 2016–17 సంవత్సరానికి చెందిన కొందరు లబ్ధిదారుల సాగు భూముల్లో కూడా ధరణి సమస్యతోనే బోర్ డ్రిల్ చేయడానికి వీలు కాలేదు. ధరణిలో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పలుమార్లు రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. భూములు కొనలేని పరిస్థితి.. ఎస్సీలకు భూ పంపిణీ పథకం ద్వారా సాగు భూములు అందజేయాలంటే ముందుగా అధికారులు ఇతరుల నుంచి పట్టా భూములను కొనుగోలు చేయాలి. విక్రయదారులు కూడా ప్రభుత్వానికి భూములను విక్రయించడానికి సమ్మతంగా ఉంటేనే సంబంధిత తహసీల్దారు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కలసి భూమిని పరిశీలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కొనేందుకు ఒక ఎకరానికి రూ.7లక్షల వరకు మాత్రమే అందజేస్తోంది. జిల్లాలో సాగు భూముల ధరలు పెరిగి పోయాయి. ఎకరానికి రూ.10 లక్షల పైనే పలుకుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న ధర, జిల్లాలోని భూముల ధరలకు రూ.3–4 లక్షల తేడా ఉంది. దీంతో భూములను కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే అత్యవసర పరిస్థితి ఉన్న వారు, ఆర్థిక పరిస్థితులు బాగోలేని వారు మాత్రమే ప్రభుత్వ ధరకు భూములను విక్రయిస్తున్నారు. కసరత్తు జరుగుతోంది.. 2017–18 వరకు ఎస్సీలకు భూ పంపిణీ జరిగింది. ధరణిలో రిజిస్ట్రేషన్ కారణంగా ఉచితంగా బోర్ డ్రిల్, విద్యుత్ కనెక్షన్, మోటారు బిగింపు ఆలస్యం అవుతోంది. అలాగే 2018–19 సంవత్సరానికి 38 ఎకరాల వరకు భూమిని గుర్తించాం. మండలాల నుంచి తహసీల్దార్లు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భూ పంపిణీ చేపడుతాం. 2019–20 సంవత్సరానికి కూడా కసరత్తు చేస్తాం. – బి.శశికళ, ఈడీ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ -
భూపంపిణీలో అనర్హులు
19 మందిలో ఏడుగురు అనర్హులని తేల్చిన ఆర్డీవో కాటారం : ప్రభుత్వం నిరుపేద దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన భూ పంపిణీ కార్యక్రమంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రెండవ విడతగా చేపట్టిన భూ పంపిణీ లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటు కల్పించినట్లు అధికారులపై విమర్శలు వస్తున్నారుు. మండలంలో మొదటగా ఇదే గ్రామపంచాయతీ పరిధిలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన అధికారులు... తిరిగి ఇదే గ్రామపంచాయతీలో రెండవ విడతగా దళితులకు భూమి పంపిణీ చేయడం కోసం చర్యలు వేగవంతం చేశారు. చిద్నెపల్లితోపాటు ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లి గ్రామపంచాయతీల పరిధిలో భూపంపిణీ కోసం భూమిని కొనుగోలు చేశారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లిల్లో ఈ ప్రక్రియ సజావుగానే కొనసాగినప్పటికీ చిద్నెపల్లిలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు తేలింది. గతంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల నుంచి రెవన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి గ్రామసభ నిర్వహించి 19 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందులో కొంతమంది అనర్హులని గతంలోనే పలువురు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదు. లబ్ధిదారుల ఎంపికలో మండల రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ నీతూప్రసాద్ విచారణ కోసం మంథని ఆర్డీఓను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీఓ బాల శ్రీనివాస్ లబ్ధిదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు సేకరించి, రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలించి 19 మందిలో ఏడుగురిని అనర్హులుగా తేల్చారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు..? భూపంపిణీలో అనర్హులకు చోటు కల్పించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా ఒత్తిళ్ల మేరకు అనర్హులకు చోటు కల్పించాల్సి వచ్చిందా? లేక క్షేత్రస్థాయిలో పరిశీలన లోపం వల్ల జరిగిందా? అని చర్చ జరుగుతోంది. ఆర్డీఓ స్థాయి అధికారి విచారణ జరిపి అనర్హులను గుర్తించే వరకు మండల రెవెన్యూ అధికారులు గుర్తించలేకపోవడం, అంతకముందు పలు ఆరోపణలు వచ్చినా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దీనికితోడు లబ్ధిదారుల ఎంపికలో పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. అటు భూ విక్రయదారులతోపాటు ఇటు లబ్ధిదారుల నుంచి ముడుపులు అందుకున్నట్లు తెలిసింది. ముందస్తు ఒప్పందం మేరకే సదరు అధికారులు, సిబ్బంది అనర్హులకు సైతం జాబితాలో చోటు కల్పించడానికి కృషి చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లిందని, తమ శాఖ పరుపుపోతుందని భావించి వదిలేసినట్లు సమాచారం. ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో గత కొంతకాలంగా మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ముఖ్య రెవెన్యూ అధికారి చక్రం తిప్పు తూ అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు ఆరోణలున్నారుు. ఉన్నతధికారులకు నివేదిస్తాం చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన భూ పంపిణీ లబ్ధిదారుల జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించాం. విచారణ జరిపి ఏగుడుగురిని అనర్హులుగా తేల్చాం. వీరి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు తిరిగి లబ్ధిదారుల ఎంపిక చేపడుతాం. - బాల శ్రీనివాస్, ఆర్డీఓ, మంథని