3.668% డీఏ పెంపు | telangana government hikes da to employees | Sakshi
Sakshi News home page

3.668% డీఏ పెంపు

Apr 21 2017 1:13 AM | Updated on Sep 5 2017 9:16 AM

3.668% డీఏ పెంపు

3.668% డీఏ పెంపు

ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • పెరిగిన డీఏ గతేడాది జూలై నుంచే అమల్లోకి..
  • మే ఒకటిన ఇచ్చే జీతంతో చెల్లింపులు
  • 2016 జూలై నుంచి ఉన్న బకాయిలు జీపీఎఫ్‌లో జమ
  • మొత్తంగా 22.008 శాతానికి పెరిగిన డీఏ
  • సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జూలై నుంచి 3.668 శాతం చొప్పున పెరిగిన డీఏ వర్తించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 18.34 శాతం డీఏ అమల్లో ఉండగా.. తాజా పెంపుతో అది 22.008 శాతానికి పెరిగింది. గురువారం ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ జీవో నం.58 జారీ చేశారు.

    ఏప్రిల్‌ నెల జీతంతోనే పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. ఆ ప్రకారం మే ఒకటో తారీఖున పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికందుతుంది. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్‌ (పీఆర్‌ఏఎన్‌) అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31 లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్‌ ఖాతా లేని ఉద్యోగులుంటే వారి డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్‌ అకౌంట్‌లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు.

    బకాయిలకు సంబంధించి మే 15 లోగా ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్‌ జీతంపై పని చేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. పెన్షనర్లకు సంబంధించిన కరువు భృతి ఉత్తర్వులను ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement