రెండోసారి విద్యాశాఖ 

Telangana Cabinet Ministers List Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ‘గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా..లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.’ అని రాజ్‌భవన్‌లో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆయనకు సీఎం కేసీఆర్‌విద్యాశాఖను కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలోనూ జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఆ తర్వాత ఆ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖను అప్పగించారు.

ఇప్పుడు మళ్లీ విద్యాశాఖను ఇస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం పది మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించగా అందులో మూడో వ్యక్తి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీశ్‌రెడ్డి దంపతులిద్దరూ సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళ్లిక, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, గండూరి ప్రకాశ్, ఓయూ జేఏసీ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మున్సిపల్‌ కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు హారతిపట్టారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, నేతలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.

కొత్త జిల్లాలో రెండోసారి మంత్రిగా..
సూర్యాపేట నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి, రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా జగదీశ్‌రెడ్డి నిలిచారు. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు మంత్రులుగా చేసిన వారిలో కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఎలిమినేటి మాధవరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు,  కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. వీరి తర్వాత ప్రస్తుతం గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు.

విద్యాశాఖ..మంత్రిగా
తెలంగాణ ప్రభుత్వ తొలి కేబినెట్‌లో తొలి విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై 2 నుంచి 2015 జనవరి 29 వరకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఆతర్వాత ఈ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి.. విద్యుత్‌ శాఖను జగదీశ్‌రెడ్డికి ఇచ్చారు. అనంతరం ఎస్సీ కులాల అభివృద్ధి శాఖను కూడా ఆయనకు కేటాయించారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రెండో కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విద్యారంగంపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ఈశాఖ ఇచ్చినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి అభీష్టం మేరకు..
ఏ శాఖ అయినా మంత్రి మండలిదే సమష్టి బాధ్యతని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభీష్టం మేరకే నడుచుకుంటానని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  వ్యవసాయదారుడిగా విద్యుత్‌శాఖ మంత్రిగా విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ తన మీద పెట్టిన బాధ్యతలతో సత్ఫలితాలు సాధిస్తానన్నారు. రెండోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top