అమ్మా డాడీని లెమ్మను..

Tahsildar Sujatha Husband Ajay Funerals Completed in Hyderabad - Sakshi

నేనేమి తప్పుచేశానని నన్ను వదిలిపెట్టి వెళ్లాడు

బోరున విలపించిన తహసీల్దార్‌ సుజాత కుమారుడు భరత్‌

అంబర్‌పేట శ్మశానవాటికలో ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌

అంత్యక్రియలు పూర్తి

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ‘అమ్మా.. డాడీని లెమ్మను.. నేనేమి తప్పుచేశానని నన్ను వదిలిపెట్టి పోయాడంటూ తహసీల్దార్‌ సుజాత కుమారుడు భరత్‌ రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎంత ఓదార్చినా భరత్‌ ఊరుకోకుండా డాడీ లే.. అంటూ రోదిస్తూనే ఉన్నాడు. మా డాడీకి ఫోన్‌ చేసింది ఎవరు..? బెదిరించింది ఎవరు...? అతనికి కూడా శిక్ష పడాలంటూ భరత్‌ అన్న మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. వివరాల్లోకి వెళితే.... అవినీతి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సుజాత భర్త అజయ్‌కుమార్‌ అంత్యక్రియలు గురువారం అంబర్‌పేట స్మశానవాటికలో ముగిశాయి. అజయ్‌కుమార్‌ బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని లలిత మ్యాన్షన్‌ అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మృతదేహానికి అదే రోజు సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మార్చురీలో భద్రపరిచారు. గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని చిక్కడపల్లిలోని ఆయన సోదరి గోక మంగళ నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని చూసిన తహసీల్దార్‌ సుజాత, కుమారుడు భరత్‌ల రోధన పలువురికి కంటతడి పెట్టించింది. 

నాయకులు, అధికారుల నివాళి..  
అజయ్‌ కుమార్‌ భౌతికకాయాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి నివాళులు అర్పించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే,కె. లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు ‡ విజయలక్ష్మీ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవీందర్, లక్ష్మీనారాయణ, థామస్, రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళతో పాటు పలువురు తహసీల్దార్‌లు, రెవెన్యూ ఉద్యోగులు  సుజాత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top