‘ఐకియా’కు స్థలంపై హైకోర్టుకు రేవంత్‌

Revanth Reddy Pill At High Court On Ikea - Sakshi

చట్ట విరుద్ధంగా కేటాయించారంటూ పిల్‌

నేడు విచారించనున్న ధర్మాసనం..  

సాక్షి, హైదరాబాద్‌: ఐకియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఫర్నిచర్‌ షోరూం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌ పన్మక్త గ్రామంలోని అత్యంత ఖరీదైన 16.27 ఎకరాల స్థలాన్ని ఐకియా ఇండియాకు ప్రభుత్వం ఏకపక్షంగా కేటాయించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. టెండర్లు ఆహ్వానించకుండానే కేటాయింపులు జరిపారని.. దీంతో ప్రభుత్వానికి రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రేవంత్‌ వెల్లడించారు. ఈ కేటాయింపులను నామినేషన్‌ పద్ధతిలో చేశారని.. ఇది చట్ట విరుద్ధమన్నారు. ఐకియా ఏర్పాటు చేస్తున్నది కేవలం ఫర్నిచర్‌ షాపు మాత్రమేనని, దీనికోసం మరో చోటైనా భూమిని కేటాయించవచ్చని వివరించారు. 

ఐటీ కంపెనీలకే కేటాయించాలి.. 
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఐటీ కంపెనీలు, దాని ఆధారిత కంపెనీలకే  భూమి కేటాయించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా ఐకియాకు కేటాయింపులు జరిగాయని రేవంత్‌ పేర్కొన్నారు. ప్రస్తుత కేటాయింపుల ద్వారా రూ.33 కోట్లు మాత్రమే ఖజానాకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ భూమిలో 3.17 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.19.21 కోట్లకు ఐదేళ్ల తర్వాత కొనుగోలు చేసేలా ఐకియాకు రిజర్వు చేశారన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని.. వ్యాజ్యం తేలే వరకు ఆ భూమిలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఐకియాను ఆదేశిం చాలని కోరారు. ఈ కేటాయింపులను చట్ట విరుద్ధంగా ప్రకటించి.. ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని ఆ కంపెనీ నుంచి రాబట్టేలా ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top