కారువైపు ప్రకాశ్ దౌడ్! | Prakash Daud karuvaipu! | Sakshi
Sakshi News home page

కారువైపు ప్రకాశ్ దౌడ్!

Feb 25 2015 1:52 AM | Updated on Mar 28 2018 11:11 AM

కారువైపు ప్రకాశ్ దౌడ్! - Sakshi

కారువైపు ప్రకాశ్ దౌడ్!

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సైకిల్ దిగి.. కారెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఈ నెలాఖరున టీఆర్‌ఎస్‌లో చేరేందుకు....

త్వరలో గులాబీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే అతి త్వరలో ముహూర్తం కేటీఆర్‌తో మంతనాలు.. చేరిక లాంఛనమే!
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సైకిల్ దిగి.. కారెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఈ నెలాఖరున టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.  మంగళవారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కీలకమంతనాలు జరిపారు. ఈ సమావేశంలో పార్టీలో చేరే అంశం చర్చకు రాలేదని, కేవలం అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు ఇరువర్గాలు చెబుతున్నా.. లోగుట్టు మాత్రం చేరికపై చర్చేనని తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత చూపారు. ఆ తర్వాత మనసు మార్చుకున్న ప్రకాశ్ అభివృద్ధి పనులపై చర్చించానే తప్ప.. తనకు టీఆర్‌ఎస్‌లో చేరే ఉద్ధేశంలేదని అప్పట్లో స్పష్టం చేశారు.
 
అయితే, తన నియోజకవర్గంలో మంచినీటి సమస్య, అభివృద్ధికి విరివిగా నిధులిస్తే గులాబీ గూటికి చేరేందుకు వెనుకాడనని పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ క్షణాన్నయినా టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని భావించినా.. తాజాగా ఆయన కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే శాసనసభ సమావేశాలకంటే ముందే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి.
 
నిధులతో గాలం
వరుసగా  రెండుసార్లు గెలుపొందినా టీడీపీ అధికారంలోకి రాకపోవడం.. మరోవైపు స్థానిక సమస్యలకు తగిన పరిష్కారం దొరక్కపోవడంతో ఆయన కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేస్తూ గులాబీ బలాన్ని పెంచుకునే ఎత్తుగడ వేస్తున్న అధికార పార్టీ.. ప్రకాష్‌పైనా గాలం విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నియోజకవర్గ సమస్యల్లో ప్రధానమైన తాగునీటి సరఫరాను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతూ.. భారీ నిధులిచ్చేందుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు ప్రత్యేకంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హాజరుకావడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement