ఊగిసలాట! | not understand of kale yadaiah behaviour | Sakshi
Sakshi News home page

ఊగిసలాట!

Nov 6 2014 12:24 AM | Updated on Mar 28 2018 11:11 AM

చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య అంతరంగం అంతు చిక్కడంలేదు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  చేవెళ్ల శాసనసభ్యుడు కాలె యాదయ్య అంతరంగం అంతు చిక్కడంలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ‘కారె’క్కనున్నట్లు ప్రకటించిన యాదయ్య...తాజాగా కాంగ్రెస్ సభ్యులతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న యాదయ్య.. తన రాజకీయ గాడ్‌ఫాదర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడంతో ఆ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకనుగుణంగా గతవారం సీఎంను కలిసి చేరికను ఖ రారు చేసుకున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌లో తన చేరికను మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు వ్యతిరేకిస్తుండడం... కాంగ్రెస్‌లోనే కొనసాగాలనే ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఆయన డోలాయమానంలో పడ్డారు.

మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, టీపీసీసీ చీప్ పొన్నాల లక్ష్మయ్యలు బుజ్జగింపులతో యాదయ్య మనసు మార్చుకునేలా చేశారు. ఈ క్రమంలోనే బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులతో కలిసి తెలంగాణ అమరుల వీరుల స్మారక స్థూపం వద్ద దర్శనమిచ్చారు. పార్టీ కండువా కప్పుకోవడమే గాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. దీంతో యాదయ్య సొంతగూటి లోనే ఉంటాననే సంకేతాలిచ్చారు.

ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు తరలిరాగా, యాదయ్య ముఖం చాటేశారు. దీంతో ఆయన పార్టీలో కొనసాగడం సందేహమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. అంతేగాకుండా అసెంబ్లీ ముగిసిన వెంటనే జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరపడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

గట్టి హామీ తీసుకున్న తర్వాతే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న యాదయ్య... అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో మీమాంసలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సాయంత్రం రవాణా మంత్రి మహేందర్‌రెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడకుండా యాదయ్య వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, అందులోభాగంగానే కాంగ్రెస్ సభ్యులతో జత కలిశారనే చర్చ సాగుతోంది.

ఇదిలావుండగా, యాదయ్య పార్టీని వీడరనే గట్టి నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నా... అంతర్గతంగా మాత్రం వెనక్కి రావడం కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం నేపథ్యంలో.. ఆయన మనసు మార్చుకుంటారని భావించడం దండగేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement