ముహూర్త బలమెవరిదో..!

Nomination Blusters In Districts - Sakshi

జిల్లాలో నామినేషన్ల హోరు 

ఒక్కరోజే పది దాఖలు

ప్రధాన అభ్యర్థులే అధికం  

శుభ ముహూర్తమే కారణం 

సాక్షి, పెద్దపల్లి: చిన్న పనిని సైతం ముహూర్తం చూసుకొని చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటిది రాజకీయాలలో మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుత రాజకీయాలన్నీ ముహూర్త బలాల చుట్టూ నడుస్తున్నాయి. ఎన్నికల పోటీ అంటే ఇంకేముంది.. వారాలు, తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలలో అతి కీలకమైన ఘట్టం నామినేషన్‌ ప్రక్రియ కావడంతో అభ్యర్థులంతా శుభ ముహూర్తంపైనే ఆధారపడ్డారు. నామినేషన్‌ల ప్రక్రియ మొదలై మూడు రోజుల తర్వాత అభ్యర్థులకు బుధవారం మంచి ముహూర్తం కుదిరింది. దీంతో జిల్లాలో నామినేషన్లు హోరెత్తాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపుగా తమ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొందరు అభ్యర్థులు ర్యాలీలు, సభలు నిర్వహించగా, మరికొందరు సాదాసీదాగా ముగించారు. ఒక్కరోజే మూడు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ వేయడంతో సందడి కనిపించింది. 

పెద్దపల్లిలో ప్రత్యర్థులంతా ఒకేరోజు! 
జిల్లా కేంద్రం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులు అందరూ ఒకే రోజు నామినేషన్‌లు దాఖలు చేశారు. బుధవారం ముహూర్తం బాగుందన్న పండితుల సూచనలతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దాసరి మనోహర్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తమ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఉదయం 11.25 గంటలకు గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నా మినేషన్‌ వేశారు. పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీస అర్జున్‌రావు ఆయన వెంట ఉన్నారు. 11.45 గంటలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి తన నామినేషన్‌ దాఖలు చేశారు. 

మాజీ ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. నామినేషన్‌ప్రక్రియలో కాస్త ఆలస్యంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు నామినేషన్‌ వేశారు. పావుగంట తరువాత కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా గొట్టిముక్కుల సురేష్‌రెడ్డి సైతం తన నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ల అనంతరం బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దపల్లిలో భారీ ద్విచక్రవాహన ర్యాలీలను నిర్వహించాయి. ప్రధాన అభ్యర్థులు ముహూర్తం చూసుకొని ఒకే రోజున తమ నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఇందులో ఎవరి ముహూర్త బలంగట్టిగా ఉందనే చర్చమొదలైంది. 
 
రామగుండంలో మక్కాన్‌సింగ్, చందర్‌ నామినేషన్‌ 

రామగుండం నియోజకవర్గంలోనూ ప్రధాన అభ్యర్థులు ఇద్దరు తమ నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, శాప్‌ మాజీ చైర్మన్‌ మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. శుభముహూర్తం ఉండడంతో బుధవారం నామినేషన్‌ వేయగా, ఈనెల 19న మరోసారి ఆయన నామినేషన్‌ వేయనున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా కోరుకంటి చందర్‌ నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ సందర్భంగా చందర్‌ గోదావరిఖనిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత తరఫున పార్టీ బీఫారంతో మరో నామినేషన్‌ దాఖలైంది.  

మంథనిలో మాజీ మంత్రి 
మంథనిలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన నామినేషన్‌ వేశారు. ముహూర్త బలం బాగుండడంతో బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తొలి రోజే నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లకు చివరి రోజైన ఈనెల 19న మరోసారి శ్రీధర్‌బాబు, మధు అట్టహాసంగా నామినేషన్‌లు వేయనున్నట్లు సమాచారం.  ఒకే రోజున మూడు నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులు తమ నామినేషన్‌లు దాఖలు చేయడంతో సందడి నెలకొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top