పంట రుణాల మాఫీ లెక్కలు తేల్చండి

Minister Harish Rao Urge Bankers To Calculate Crop Loan Waiver - Sakshi

బ్యాంకర్లకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయనుందని, దీనికి సంబంధించిన లెక్కలను తేల్చాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. గతంలో నిబంధనలను అనుసరించి అర్హులైన రైతుల జాబితాను వచ్చె నెల 10లోగా సిద్ధం చేయాలని సూచించారు. 2018 డిసెంబర్‌ 11 కటాఫ్‌ తేదీగా లక్ష లోపు రుణాలు, వాటికి సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

అయితే మాఫీ ఎలా చేయాలనే విధానంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని బ్యాంకర్లకు చెప్పారు. సోమవారం బేగంపేటలోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో 25వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు బ్యాంకర్లు, ఉన్నతాధికారులతో అరగంట పాటు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పథకం కింద జమ చేసిన మొత్తంలో రైతులకు చెల్లించింది పోగా మిగిలిన మొత్తాన్ని వెంటనే తిరిగి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పినట్లు తెలిపారు.  

జనవరి 10లోగా వివరాలు అందించండి 
ప్రభుత్వ వివిధ శాఖల్లో, వివిధ స్థాయి అధికారుల అకౌంట్లలో ఉన్న డిపాజిట్‌లపై జనవరి 10లోగా వివరాలు అందించాలని హరీశ్‌ తెలిపారు. మొదటి విడత రైతుల రుణమాఫీ చేయగా బ్యాంకుల్లో మిగిలిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. సామాజిక పెన్షన్‌ చెల్లింపులో భాగం గా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన తర్వాత ఆ ఖాతా ఉపయోగం లేదని బ్లాక్‌ చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు 13 శాతం, 14 శాతం నుండి వడ్డీ రేట్లను తగ్గించాలని పేర్కొన్నారు. గత రుణమాఫీలో ఆడిట్‌ సందర్భంగా తెలిపిన అంశా లు బ్యాంకర్స్‌కు మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ లలిత్‌ కుమార్, ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతా దాస్, ఆర్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ సుందరం శంకర్, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

రుణమాఫీ అర్హతలపై చర్చ! 
ఉన్నతాధికారులతో బ్యాంకర్లు జరిపిన అంతర్గత సమావేశంలో రుణమాఫీకి అర్హులను ఎలా గుర్తించాలనే దానిపై వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. 2018 డిసెంబర్‌ 11ని కటాఫ్‌ తేదీగా ప్రకటించినప్పటికీ, ఎప్ప టి నుంచి అనే దానిపై స్పష్టత కొరవడింది. 
కుటుంబంలో ఒక రైతుకే మాఫీ వర్తించాలి.
ఆ రైతుకు ఒక చోటనే మాఫీ చేస్తారు.
మిగతా ఎక్కడా పంట రుణం తీసుకున్నా మాఫీ వర్తించదు. 
బంగారంపై వ్యవసాయ పంట రుణాలు తీసుకున్న వారికి వర్తింపుపై సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 
మాఫీపై ప్రభుత్వం పలు రకాల విధానాలను యోచిస్తుంది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విడతల వారీగా రైతుకు చెక్కు ఇవ్వడమా? బ్యాంకు ఖాతాలో జమ చేయడమా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top