కరోనా: తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం

Mango Farmers Facing Problems During Lockdown - Sakshi

మామిడి రైతుల్లో కరోనా కంగారు

గణనీయంగా తగ్గిన దిగుబడి

ఎగుమతులపై తీవ్ర ప్రభావం

మార్కెటింగ్‌కు తప్పని ఇబ్బందులు

సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్‌) : మామిడి రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మామిడి రైతులకు గడ్డు పరిస్థితి నెలకొంది. నానా అవస్థలు పడుతూ.. లక్షల పెట్టుబడి పెట్టి కాపాడుకుంటూ వచ్చిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో..? ఏం చేయాలోనని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రకృతి కరుణించకపోవడంతో ఈయేడు మామిడి 30 శాతం వరకే కాత కాసింది. ఆ కాస్త పంటనైనా అమ్ముకోలేక.. ఇతర ప్రాంతాలకు తరలించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకొచి్చన మామిడిని తెంపితే మార్కెట్‌ లేదు.. తెంపకపోతే వర్షాలు కురిస్తే రాలిపోతాయి. ఇదే బెంగతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. (కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు )

18 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలోని నెన్నెల, జైపూర్, భీమారం, చెన్నూర్, తాండూర్‌ మండలాల్లో సుమారు 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 6 వేల ఎకరాల్లో నెన్నెలలో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా పరోక్షంగా, ప్రత్యక్షంగా మామిడి తోటలపై 25 వేల మంది రైతులు, కూలీలు ఆధారపడి జీవిస్తుంటారు. ఏటా 20 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్‌పూర్, హైదరాబాద్, నిజామాబాద్‌ పట్టణాల్లోని మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలో.. అప్పులు ఎలా తీరుతాయోనని రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

కేజీకి రూ.50 చొప్పున సెర్ప్‌ ద్వారా కొంటే మేలు
మామిడికాయలను సెర్ప్‌ ద్వారా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. బంగినపల్లి కాయలు కేజీకి రూ.35 చెల్లించాలని నిర్ణయించారు. కాని ఆ ధర గిట్టుబాటు కాదని ప్రస్తుతం కాత తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కేజీకి రూ.50 చొప్పున సెర్ప్‌ ద్వారా కొనుగోలు చేస్తే కొంత వరకు ఊరట కలుగుతుందని రైతులు అంటున్నారు. బంగినపల్లితో పాటు అన్ని రకాల చిన్న, పెద్ద కాయలను సైతం సెర్ప్‌ ద్వారా>నే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. (రాష్ట్రపతి భవన్‌లో కరోనా పాజిటివ్‌ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top