రాష్ట్రపతి భవన్‌ కార్మికుడికి కరోనా పాజిటివ్‌!

Coronavirus Positive In Rashtrapati Bhavan Worker - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో వ్యాప్తిచెందిన వైరస్‌ తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనికి కూడా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్‌ కారణంగా మృతి చెందారు.

తాజాగా అతని కూడా వైరస్‌ సోకడంతో పరిసర ప్రాంతాల్లోని 125 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. మొత్తం 125 కుటుంబాల్లో 500 మందిని స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు ఢిల్లీ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్రపతి భవన్‌లో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా ఢిల్లీలోని కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సోమవారం అర్థరాత్రి నాటికి కరోనా కేసుల సంఖ్య 2,003కి చేరింది. మరోవైపు వైరస్‌ కారణంగా 45 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top